Manmohan Singh | హైదరాబాద్, డిసెంబర్ 27 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): భారత మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త, ఉన్నత విద్యావంతుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతితో యావత్తు భారతావని శోకసంద్రంలో మునిగిపోయింది. క్లిష్టసమయంలో దేశాన్ని గట్టెక్కించి దేశాన్ని అభివృద్ధిపథంలో పరుగులు పెట్టించిన ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగానే కాదు ఇంకా ఎన్నో విషయాల్లో మన్మోహన్ అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచారు. ఆయన జీవితంలో జరిగిన కొన్ని అరుదైన విషయాలను తరచిచూస్తే..
మన్మోహన్‌ది మధ్యతరగతి కుటుంబం. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆయన చదివేటప్పుడు ట్యూషన్‌ఫీజు, రోజూవారీ ఖర్చుల కోసం మన్మోహన్ తండ్రి ఎంతో కష్టపడి డబ్బులు పంపించేవారు. అయితే, కొన్నిసార్లు అది ఆయనకు సరిపోయేదికాదు. దీంతో భోజనానికి సరిపడా డబ్బులులేక మన్మోహన్ చాక్లెట్లతో కడుపునింపుకొన్నారని, కొన్నిసార్లు పస్తులు ఉండేవారని ఆయన కుమార్తె దమన్‌సింగ్ ‘స్ట్రిక్ట్లీ పర్సనల్: మన్మోహన్ అండ్ గురుశరణ్’ పుస్తకంలో పేర్కొన్నారు.
యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనగానే అందరికీ గుర్తొచ్చే మన్మోహన్.. తాను యాక్సిడెంటల్ ఫైనాన్స్ మినిస్టర్‌ను కూడా అని చెప్తారట. 1991లో పీవీ నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు మన్మోహన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి ఛైర్మన్‌గా ఉన్నారు. అప్పుడు దేశంలో రాజకీయ, ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో ఓ రాత్రి మన్మోహన్ ఇంట్లో నిద్రిస్తుండగా.. ప్రధానమంత్రి ముఖ్యకార్యదర్శి ఆఫీసు నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చిందట. ఆర్థికశాఖ మంత్రిగా తనను కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోబోతున్నట్టు ఆ ఫోన్ కాల్ సారాంశం. అలా మన్మోహన్ యాక్సిడెంటల్ ఫైనాన్స్ మినిస్టర్ అయ్యారని ఆయన కుమార్తె దమన్‌సింగ్ ‘స్ట్రిక్ట్లీ పర్సనల్: మన్మోహన్ అండ్ గురుశరణ్’ పుస్తకంలో రాశారు.
1992లో దేశ రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన స్టాక్ ఎక్సేంజ్ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ, విలువలకు కట్టుబడుతూ 1993లో ఆర్థికమంత్రి పదవికి మన్మోహన్ రాజీనామా సమర్పించారు. అయితే, ప్రధాని పీవీ ఆయన్ని వారించారు. ఈ ఘటనను బట్టి పదవుల కంటే నైతిక విలువలే మన్మోహన్‌కు ముఖ్యమన్న విషయం అర్థమవుతున్నది.
2009లో ప్రధానిగా ఉన్న సమయంలోనే మన్మోహన్ గుండెనొప్పితో విలవిల్లాడిపోయారు. దీంతో ఆయనకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స అందించారు. 10 గంటలపాటు ఈ ట్రీట్మెంట్ కొనసాగింది. స్పృహలోకి వచ్చిన వెంటనే మన్మోహన్.. ‘నా దేశం ఎలా ఉంది? కశ్మీర్లో పరిస్థితేంటి?’ అని అడిగారని మన్మోహన్‌కు చికిత్సనందించిన డాక్టర్ రమాకాంత్ పాండా గుర్తుచేసుకొన్నారు.
అమెరికాతో పౌర అణు ఒప్పందాన్ని చేసుకోవడం తన జీవితంలో బెస్ట్ అంశమని మన్మోహన్ పీఎం హోదాలో తన చివరి మీడియా సమావేశంలో తెలిపారు. అణువివక్షతతో ఆర్థిక, సాంకేతిక, సామాజిక పురోగతులు సాధించలేమని ఆయన చెప్పేవారు. ఇక, ‘జాతీయ ఆరోగ్య కార్యక్రమం ద్వారా స్త్రీ, శిశు ఆరోగ్యంపై ఎంతో చేద్దామనుకొన్నాం. మెరుగైన ఫలితాలే సాధించాం. అయితే ఇంకా చేయాల్సి ఉండేది. దీనిపైనే నేను పశ్చాత్తాప పడుతు’న్నట్టు మన్మోహన్ పేర్కొన్నారు.
‘స్టాక్‌మార్కెట్లను తలుచుకొని నా నిద్రను పాడుచేసుకోను’ అని 1992లో ఆర్థికమంత్రి హోదాలో మన్మోహన్ పేర్కొనడం తెలిసిందే. దీనికి తగ్గట్టే, మన్మోహన్ తన డబ్బును ఎక్కువగా సంప్రదాయ ఫిక్స్డ్ డిపాజిట్లలోనే జమ చేసినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ఆయన ఎన్నికల ప్రమాణపత్రాల ద్వారా అర్థమవుతున్నది.
1962లోనే భారత తొలి ప్రధాని నెహ్రూ తన ప్రభుత్వంలోకి రావాలంటూ మన్మోహన్‌కు ఆహ్వానాన్ని పంపించారు. అయితే, అమృత్‌సర్‌లో తాను చదువుకొన్న కాలేజీలో లెక్చరర్‌గా పాఠాలు చెప్తానని అప్పటికే కాలేజీ వారితో ఒప్పందం కుదుర్చుకొన్నానని, దీంతో తాను రాలేనని మన్మోహన్.. నెహ్రూ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు.
మన్మోహన్‌కు ప్రతీరోజూ ఉదయం బీబీసీ వార్తలు వినడం అలవాటు. అలా డిసెంబర్ 26, 2004రోజు కూడా వార్తలు వింటున్నారట. ఇదే సమయంలో ఇండోనేషియాలో సునామీ వచ్చినట్టు బీబీసీ తొలుత రిపోర్ట్ చేయడంతో అప్రమత్తమైన మన్మోహన్.. తగిన విధంగా స్పందించారు. అలా ప్రాణనష్టం కొంతమేర తగ్గింది.
ప్రధాని హోదాలో మన్మోహన్ లగ్జరీ కార్లలో ప్రయాణించినప్పటికీ ఆయనకు ఒకే ఒక్క సొంతకారు మారుతి 800 ఉండేదని, అదంటే ఆయనకు ఎంతో ఇష్టమని మన్మోహన్ హయాంలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) చీఫ్‌గా పనిచేసిన మాజీ ఐపీఎస్ అధికారి అరుణ్ అసిమ్ పేర్కొన్నారు. పీఎం అధికారిక నివాసంలో బీఎండబ్ల్యూ కారు వెనుక ఈ మారుతి కారు పార్కు చేసేదని తెలిపారు. ఈ కారు ఇక్కడే ఎందుకని ఓసారి ప్రశ్నించగా.. ‘మారుతిని చూస్తే సామాన్యులకు నేను చేయాల్సిన పని గుర్తుకువస్తుంది’ అని మన్మోహన్ అన్నారని ఆయన గుర్తుచేసుకొన్నారు.
18: ప్రతీరోజూ అవిశ్రాంతంగా పనిచేసిన గంటలు.
300: ప్రధానిహోదాలో రోజూ కనీసం పరిష్కరించిన ఫైల్స్
0: బైపాస్ సర్జరీ సమయంలో మినహా పదేండ్లహయాంలో మన్మోహన్ ఎన్నడూ తన డ్యూటీస్‌కి సెలవు పెట్టలేదు.
10.8% మన్మోహన్ హయాంలో భారత్ నమోదు చేసిన అత్యధిక జీడీపీ వృద్ధిరేటు.
2: మన్మోహన్ హయాంలో అత్యంత వేగంగా ఆర్థికాభివృద్ధి చెందుతున్న రెండో దేశంగా భారత్
1: ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన తొలి సిక్కు వ్యక్తి
33ఏండ్లు: మన్మోహన్ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగిన కాలం
న్యూఢిల్లీ, డిసెంబర్ 27: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల కోసం కేంద్ర హోం శాఖ కేటాయించిన నిగంబోధ్ ఘాట్ శ్మశానవాటికపై వివాదం ఏర్పడింది. ఈ విషయమై బీజేపీ, ప్రతిపక్షం మధ్య వాగ్వివాదం జరిగింది. అంత్యక్రియల కోసం నిగంబోధ్ ఘాట్ కాకుండా మన్మోహన్ స్మారకం నిర్మించేందుకు అనువుగా స్థలాన్ని ఎంపిక చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గౌరవార్థం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్మారకం ఏదీ నిర్మించలేదని బీజేపీ గుర్తు చేసింది. ఈ అంశంపై శుక్రవారం రాజకీయ వివాదం రాజుకుంది. మన్మోహన్ సింగ్‌కు దేశ రాజధానిలో స్మారకం నిర్మించాలని కేంద్రం నిర్ణయించిందని, ఈ విషయంపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని అధికార వర్గాలు శుక్రవారం ఆరోపించాయి. స్మారకం నిర్మాణంపై నిర్ణయాన్ని కాంగ్రెస్‌కు తెలియచేసినట్లు వారు చెప్పారు. అయితే ఇందుకు తగిన వేదికను కనుగొనడానికి కొన్ని రోజులు పట్టవచ్చని తెలిపారు.
అంతకుముందు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీకి లేఖ రాస్తూ మన్మోహన్ స్మారకం నిర్మించే స్థలంలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. కాగా, అంత్యక్రియల స్థలం పవిత్ర వేదికగా మారే సంప్రదాయాన్ని ప్రస్తావిస్తూ ఖర్గే రాసిన లేఖను బీజేపీ జాతీయ ప్రతినిధి సీఆర్ కేశవన్ ఉటంకిస్తూ 2004లో మరణించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు తన పదేళ్ల పాలనలో కాంగ్రెస్ ఎలాంటి స్మారకాన్ని నిర్మించలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. స్మారకం కాదు కదా, ఢిల్లీలో పీవీ అంత్యక్రియలు చేయడానికి కూడా కాంగ్రెస్ అధిష్ఠానం ఇష్టపడలేదని అన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ మృతి పట్ల మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాను కష్టంలో ఉన్నప్పుడు మన్మోహన్ చూపిన దయాగుణాన్ని గుర్తుచేసుకున్నారు. తాను జైలులో ఉన్నప్పుడు మన్మోహన్ తన పిల్లలకు స్కాలర్షిప్లు ఇప్పిస్తానని చెప్పినట్టు వెల్లడించారు. మన్మోహన్ తన మిత్రుడు, సోదరుడు అని ఎక్స్‌లో నివాళి ఆర్పించారు. అన్వర్ ఇబ్రహీం 1999 నుంచి 2004 వరకు జైలులో ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్ రాజ్యసభలో విపక్ష నేతగా ఉండేవారు. ఆ సమయంలో ఆయన తనకు అండగా ఉండటమే కాక, తన పిల్లల చదువులకు స్కాలర్షిప్లను ఆఫర్ చేశారని చెప్పారు.
మన్మోహన్ సింగ్ మృతితో పాకిస్థాన్‌లో గాహ్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మన్మోహన్ సింగ్ ఈ గ్రామంలోనే జన్మించారు. 187 అడ్మిషన్ నంబరుతో నాలుగో తరగతి వరకు గ్రామంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో చదువుకున్నారు. గ్రామస్థులు ఆయనను ‘మోహ్న’ అని పిలిచేవారు. స్వాతంత్య్రానికి ముందు పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న ఈ గ్రామంలో దేశ విభజనతో పాకిస్థాన్‌లోకి వెళ్లింది. దీంతో మన్మోహన్ సింగ్ కుటుంబం భారత్‌కు వచ్చి స్థిరపడింది. మన్మోహన్ ప్రధాని అయిన తర్వాత గాహ్ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అక్కడి ప్రభుత్వం అభివృద్ధి చేసింది. తమ గ్రామానికి గుర్తింపు తెచ్చిన మన్మోహన్ సింగ్ మరణంతో గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. ‘మా ఇంట్లో వ్యక్తి మరణించినట్టు అనిపిస్తున్నది’ అని గ్రామానికి చెందిన స్కూల్ టీచర్ అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. 2008లో ఈ గ్రామానికి చెందిన తన చిన్ననాటి స్నేహితుడు రాజా మహమ్మద్ అలీని మన్మోహన్ ఢిల్లీకి పిలిపించుకొని కలిశారు.
మన్మోహన్ సింగ్ జీవితంలో అనేక ఆసక్తికర ఘట్టాలు, అనూహ్యమైన సందర్భాలు ఉన్నాయి. వాటిలో కొన్ని..
నానమ్మ నోటికొచ్చిందే డేట్ ఆఫ్ బర్త్: మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న జన్మించారని రికార్డుల్లో నమోదయ్యింది. అయితే, ఇది ఆయన అసలు పుట్టిన తేదీ కాదు. ఆయనను పాఠశాలలో చేర్చే సమయంలో తన నానమ్మ మదికి వచ్చిన తేదీని పుట్టిన తేదీగా చెప్పారు. ఉపాధ్యాయులు దానినే స్కూల్ రికార్డుల్లో నమోదు చేయడంతో ఆయన పుట్టిన తేదీగా స్థిరపడిపోయింది.
ఉర్దూలో రాసుకొని హిందీ స్పీచ్: మన్మోహన్ సింగ్ ప్రాథమిక విద్యాభ్యాసం ఉర్దూ మీడియంలో సాగింది. దీంతో ఆయనకు ఉర్దూలో మంచి ప్రావీణ్యం ఉండేది. ఆర్థికమంత్రిగా, ప్రధానిగా హిందీలో ఆయన ప్రసంగాలు ఇచ్చేటప్పుడు ముందుగా ఉర్దూలో రాసుకునే వారు. ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి టీవీలో ప్రసంగించడానికి ఆయన హిందీలో మూడు రోజులు ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది.
సలహాలకు ఎల్లప్పుడూ స్వాగతం: ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఆయా రంగాలకు చెందిన నిపుణులతో సంప్రదించేవారు. వారి సలహాలు, సూచనలు స్వీకరించేవారు. కే సుబ్రహ్మణ్యం, వీపీఆర్ విఠల్ వంటి వారితో ఆయన ఎక్కువగా సంప్రదింపులు జరిపేవారు. చైనా గురించి లోతుగా అర్థం చేసుకునేందుకు ఓసారి ఆయన సింగపూర్ నాయకుడు లీ కౌన్ యూతో రెండు రోజుల పాటు మాట్లాడారు.
మితాహారి: మన్మోహన్ సింగ్ మితంగా ఆహారం తీసుకునే వారు. అయినప్పటికీ ఆయనకు కొన్ని ఇష్టమైన ఆహారాలు ఉన్నాయి. ఢోక్లా అంటే ఆయనకు చాలా ఇష్టం. మన్మోహన్ ప్రధాని అయిన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయ స్నాక్స్ మెనూలో సమోసా, కచోరీ బదులు ఢోక్లా చేరింది. చాయ్, మారీ బిస్కెట్లను సైతం ఆయన ఇష్టంగా తినేవారు.
ఆగ్రహమూ తెలుసు: మన్మోహన్ సింగ్ ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించినప్పటికీ ఆయన ఆగ్రహించిన సందర్భాలూ ఉన్నాయి. ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిరోజు పార్లమెంటులో ఆయన ప్రసంగించకుండా ఎన్డీఏ ఎంపీలు అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆయన కార్యాలయానికి ఎన్డీఏ బృందం వెళ్లగా వారిని కూర్చోమని కూడా మన్మోహన్ చెప్పలేదట. వారిచ్చిన వినతిపత్రాన్ని కూడా చదవకుండానే విసిరేశారట.
రాజకీయాలకు అతీతంగా స్నేహం: మన్మోహన్ సింగ్ రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే సాగినప్పటికీ ఆయనకు రాజకీయ స్నేహితులు మాత్రం ఇతర పార్టీల్లోనే ఎక్కువగా ఉండేవారు. శరద్ పవార్, హరికిషన్ సింగ్ సుర్జీత్, కరుణానిధి, లాలూప్రసాద్ యాదవ్, రఘువంశ్ ప్రసాద్ సింగ్ వంటి వివిధ పార్టీల నేతలతో ఆయనకు స్నేహం ఉండేది.