న్యూఢిల్లీ, డిసెంబర్ 27: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులు అర్పించారు. శుక్రవారం మాజీ ప్రధాని భౌతికకాయాన్ని ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్డులో గల ఆయన నివాసానికి తరలించారు. రాష్ట్రపతితో పాటు ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదితరులు మన్మోహన్ సింగ్ పార్ధివ దేహానికి సందర్శించి, నివాళులు అర్పించారు. ఆయన సతీమణి గురుశరణ్ కౌర్, కుటుంబసభ్యులను పరామర్శించారు.
కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, చంద్రబాబు నాయుడు, సుఖ్విందర్ సింగ్ సుఖు, రేవంత్ రెడ్డి, ఆతిశి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వివిధ పార్టీల నేతలు అఖిలేశ్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ తదితరులు మన్మోహన్ సింగ్కు నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ మృతికి కేంద్ర మంత్రివర్గం సంతాపం తెలిపింది. శుక్రవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక రాజనీతిజ్ఞుడిని, ప్రఖ్యాత ఆర్థికవేత్తను, విశిష్ట నాయకుడిని కోల్పోయిందని మంత్రివర్గం పేర్కొన్నది.
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి ఉదయం 9.30 గంటలకు ఆయన అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఉదయం 11:45 గంటలకు ఢిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్ శ్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఇందుకోసం రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. యమునా నది తీరాన మన్మోహన్ సింగ్కు స్మృతివనాన్ని నిర్మించేందుకు స్థలాన్ని కేటాయించాల్సిందిగా కేంద్రాన్ని కాంగ్రెస్ కోరినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ప్రధానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే విజ్ఞప్తి చేశారు.