Union Cabinet : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి కేంద్ర క్యాబినెట్ సంతాపం తెలిపింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ సంతాప తీర్మానం చేసింది. క్యాబినెట్ సమావేశంలో మన్మోహన్ మృతికి సంతాపంగా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. వచ్చే నెల 1వ తేదీ వరకు ఏడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించారు. ఈ మేరకు కేంద్రం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఈ ఏడు రోజులపాటు దేశవ్యాప్తంగా, విదేశాల్లోని ఇండియన్ మిషన్స్, రాయబార కార్యాలయాల్లో జాతీయజెండాను సగం వరకు ఎగురవేయనున్నారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించారు. అంత్యక్రియల రోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు హాఫ్ డే సెలవు ప్రకటించారు.
మన్మోహన్ సింగ్ మృతిపట్ల క్యాబినెట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న పశ్చిమ పంజాబ్‌లోని గాహ్‌లో జన్మించారు. 1954లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి అర్థశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పూర్తిచేశారు. 1962లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆయన డాక్టరేట్ ఇచ్చింది.
చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో సీనియర్ లెక్చరర్‌గా మన్మోహన్ సింగ్ తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత అదే యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ అయ్యారు. అనంతరం ఢిల్లీ యూనివర్సిటీలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఇంటర్నేషనల్ ట్రేడ్ ప్రొఫెసర్‌గా చేరారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖలో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. ప్లానింగ్ కమిషన్ మెంబర్ సెక్రెటరీగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు.