వాషింగ్టన్, నవంబర్ 9: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో హైదరాబాద్‌కు చెందిన అరుణా మిల్లర్ చరిత్ర సృష్టించారు. మేరీల్యాండ్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఎన్నికై సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. భారత సంతతికి చెందిన వ్యక్తి అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఈ ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ పార్టీ తరఫున మేరీల్యాండ్ గవర్నర్, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పదవులకు పోటీచేసిన వెస్ మూర్, అరుణా మిల్లర్.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులపై సునాయాసంగా విజయం సాధించారు. అక్కడ గవర్నర్ తర్వాత అత్యున్నత హోదా లెఫ్టినెంట్ గవర్నర్దే. ఒకవేళ గవర్నర్ సరైన రీతిలో విధులు నిర్వర్తించలేకపోతే ఆ బాధ్యతలను లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు అప్పగిస్తారు.
ప్రస్తుతం 58వ పడిలో ఉన్న అరుణా మిల్లర్ హైదరాబాద్‌లో జన్మించారు. అరుణకు ఏడేండ్ల వయసున్నప్పుడు (1972లో) ఆమె కుటుంబం అమెరికాకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. మేరీల్యాండ్‌లో అరుణకు విస్తృత ప్రజాదరణ ఉన్నది. ఆమెకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మేరీల్యాండ్‌లో విస్తృత ప్రచారం చేయడంతోపాటు పలువురు రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు సైతం అరుణకు అనుకూలంగా పనిచేయడంతో సునాయాసంగా విజయం సాధించినట్టు తెలుస్తున్నది.
రాజా, జయపాల్ నాలుగోసారి
ఈ ఎన్నికల్లో అరుణా మిల్లర్‌తోపాటు భారత సంతతికి చెందిన పలువురు సత్తా చాటారు. అధికార డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీచేసిన రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, అమీబెరా ప్రమీలా జయపాల్, శ్రీ థానేదార్ అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. వారితోపాటు అమెరికాలోని పలు రాష్ర్టాల చట్టసభలకు ఎంతో మంది భారతీయులు ఎన్నికయ్యారు. ఇల్లినాయిస్ జిల్లాలో రిపబ్లికన్ పార్టీ ప్రత్యర్థి క్రిస్ డర్గిస్ను మట్టికరిపించిన రాజా కృష్ణమూర్తి (49) వరుసగా నాలుగోసారి ప్రతినిధుల సభకు ఎన్నికవగా.. రాజకీయవేత్తగా మారిన వ్యాపారవేత్త శ్రీ థానేదార్ (67) మిషిగన్‌లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిపై గెలుపొందారు. రో ఖన్నా (46) కాలిఫోర్నియాలో, ప్రమీ లా వాషింగ్టన్లో రిపబ్లికన్ అభ్యర్థులను ఓడించారు.