Donald Trump | అమెరికా ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎలాన్ మస్క్ (Elon Musk).. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మస్క్ ప్రకటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా స్పందించారు. మస్క్‌పై ప్రశంసలు కురిపించారు. ఎలాన్ మస్క్ ఓ అద్భుతం అంటూ కితాబిచ్చారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.
‘ఎలాన్ మస్క్ ఓ అద్భతుమైన వ్యక్తి. ఇది ఆయన చివరి రోజు. అయినా, అతను ఎల్లప్పుడూ మాతోనే ఉంటారు. అన్ని విధాలుగా సాయం అందిస్తూనే ఉంటారు’ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు రేపు మస్క్‌తో కలిసి ఓవెల్ ఆఫీస్ (Oval Office)లో మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ట్రంప్ ఈ సందర్భంగా వెల్లడించారు.
గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో ఎలాన్ మస్క్ ప్రముఖ పాత్ర పోషించారు. భారీగా నిధులు సమకూర్చడంతోపాటు ప్రచార బాధ్యతలు కూడా పర్యవేక్షించారు. ఇందుకుగాను ట్రంప్ దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మస్క్‌కు తన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ వ్యయాలను తగ్గించడానికి ఉద్దేశించిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) శాఖ బాధ్యతలను ఆయన చేతికిచ్చారు.
దీంతో ఆయన ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాల తొలగింపు చేపట్టడంతోపాటు వృధా ఖర్చులకు కత్తేర వేయడం ద్వారా ప్రభుత్వానికి భారీగా నిధులను మిగిల్చారు. అయితే ట్రంప్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఓ బిల్లును మస్క్ వ్యతిరేకించారు. ఈ బిల్లుకు అధిక బడ్జెట్ కేటాయించాల్సి వస్తుండడం వల్ల.. ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలనే డోజ్ ఆశయాలకు గండి కొడుతుందన్నారు. ఈ నిర్ణయంతో డోజ్ తీసుకున్న చర్యలు వృథా అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు సామాజిన మాధ్యమం ఎక్స్‌లో ప్రకటన చేశారు. ‘అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగిగా తన షెడ్యూల్ ముగిసింది. ప్రభుత్వంలో వృథా ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడు ట్రంప్‌నకు ఆయన ధన్యవాదాలు. డోజ్ మిషన్ భవిష్యత్తులో మరింత బలపడుతుంది’ అంటూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. వ్యయ బిల్లుపై ట్రంప్ సంతకం చేశారని, ఇది డోజ్ చేసిన కృషికి విఘాతమంటూ ట్రంప్‌పై మస్క్ మొదటిసారి విమర్శలు గుప్పించారు.
కాగా.. అమెరికా చట్టాల ప్రకారం ఏ వ్యక్తికీ వరుసగా 130 రోజులకు మించి ఈ హోదాను ఇవ్వకూడదు. ఈ లెక్కల ప్రకారం మే 30తో మస్క్ గడువు పూర్తికానుంది. దీని ప్రకారమే మస్క్ తన బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అయితే, మస్క్ వైదొలిగినప్పటికీ డోజ్ తన పనిని కొనసాగిస్తోందని ట్రంప్ గతంలోనే తెలిపారు. క్యాబినెట్ సెక్రటరీలు దీని బాధ్యతలు నిర్వహిస్తారని వెల్లడించారు. అయితే అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవమైన 2026 జూలై 4వ తేదీలోపు ఫెడరల్ బ్యూరోక్రసిని మొత్తం డోజ్ ప్రక్షాళన చేయాల్సి ఉంది. ఆ తర్వాత డోజ్ కాలపరిమితి దానికదే ముగియనుంది. మస్క్ తప్పుకోవడంతో డోజ్‌కు ట్రంప్ కొత్త సారథిని నియమిస్తారా లేదా ఆ వ్యవస్థను మొత్తమే రద్దు చేస్తారా అనే చూడాల్సి ఉంది.
Also Read..
Trumps tariffs | సుంకాలపై ట్రంప్‌కు అనుకూలంగా తీర్పు
Donald Trump | ‘అమ్మో’రికా.. వలస విధానాలపై ట్రంప్ కఠిన ఆంక్షలు