Donald Trump | హైదరాబాద్ (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలపై తీసుకొంటున్న కఠిన నిర్ణయాలు భారతీయ విద్యార్థులు, ఉద్యోగుల్లో కలవరాన్ని సృష్టిస్తున్నాయి. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదాన్ని చూపిస్తూ విదేశీయులపై ఆయన విధిస్తున్న ఆంక్షలు ఇండియన్ల ‘డాలర్ డ్రీమ్స్’ను కల్లలుగా మారుస్తున్నాయి. జనవరి 20న అధికారంలోకి వచ్చింది మొదలు అక్రమ వలసలు, హెచ్1బీ, గ్రీన్‌కార్డు, జన్మతః పౌరసత్వ రద్దు, ఎఫ్1, ఓపీటీ.. ఇలా ప్రతీ అంశంలో ఆయన నిర్ణయం భారతీయులకు కునుకులేకుండా చేస్తున్నది.
అమెరికాలో పుట్టినవారికి జన్మతః పౌరసత్వం లభిస్తుంది. అయితే, దీన్ని రద్దు చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకొన్నారు. దీంతో హెచ్1బీ, స్టడీ వీసాలపై అమెరికాకు వెళ్లినవారు, గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారు కలవరానికి గురయ్యారు. ఫిబ్రవరి 20 నుంచి ఆదేశాలు అమల్లోకి వస్తాయని ప్రచారం జరుగడంతో కొంతమంది గర్భిణీలు ఇంకా డేట్ ఉండగానే ముందస్తు ప్రసవాలకు సిద్ధపడ్డారు. ట్రంప్ నిర్ణయంపై కోర్టు కేసులు నడుస్తున్నాయి.
ఏదో ఒక వంకతో విదేశీయులను వెనక్కి పంపించేందుకు ట్రంప్ సర్కారు వింత రూల్స్‌ను తీసుకొచ్చింది. విద్యార్థి లేదా వర్క్ వీసాపై ఉన్నవారు డ్రంకెన్ డ్రైవింగ్‌లో దొరికితే వారి వీసాను రద్దు చేశారు. మిన్నెసోటా యూనివర్సిటీలో ఇలాంటి ఘటనలే చోటుచేసుకొన్నాయి. ఇక, హమాస్, ఇతర ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా ఎవరైనా సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తే వారి ఎఫ్1, ఎం1, జే1 వీసాలను రద్దు చేశారు. దీనికోసం ఏఐతో నిఘాను పెట్టారు. విదేశీ విద్యార్థుల సోషల్‌మీడియా ఖాతాల విశ్లేషణ కోసం కొత్త వీసా ఇంటర్వ్యూలను ట్రంప్ సర్కారు తాత్కాలికంగా నిలిపేయడం వివాదంగా మారింది.
అమెరికాలోని విద్యాసంస్థల్లో చదువుతున్న విదేశీ విద్యార్థులు కాలేజీ మానేసినా, విద్యా సంస్థకు చెప్పకుండా స్టడీ ప్రొగ్రామ్‌కు వెళ్లినా.. అదేపనిగా క్లాసులకు ఎగ్గొడుతూ హాజరుశాతం తక్కువగా ఉన్నా వారి వీసాలను రద్దు చేస్తామని ట్రంప్ సర్కారు ప్రకటించింది.
అమెరికన్ సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలపై పోస్టులు పెట్టే అమెరికన్లను సెన్సార్ చేసే విదేశీయులపై ట్రంప్ ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకొంది. అలాంటి వారికి ఎలాంటి వీసాలు జారీ చేయకుండా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. చిన్న కారణాలతో ఎఫ్-1 వీసాలను రద్దు చేయడాన్ని ఇప్పటికే పలువురు న్యాయస్థానాల్లో సవాల్ చేశారు. హెచ్1బీ, ఎల్1 వీసాల ఆటో రెన్యువల్‌ను రద్దు చేయడంతో పాటు పరిమితిలో కోత విధించడానికి కూడా ట్రంప్ సర్కారు కసరత్తు ప్రారంభించింది.
హెచ్1బీ వీసాదారులు అమెరికాను విడిచిపెట్టి వెళ్లొద్దంటూ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి ప్రఖ్యాత టెక్ కంపెనీలు సర్క్యులర్లు జారీ చేశాయి. స్వదేశానికి వెళ్తే అమెరికాకు తిరిగి రాలేరంటూ హెచ్చరికలు జారీ చేశాయి.
ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన అనంతరం అమెరికా వలస విధానాలను మరింత కఠినతరం చేశారు. ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాకు వలస వచ్చిన లక్షలాది మందిని ఆయన సొంత దేశాలకు సాగనంపారు. అమెరికాలో దాదాపు 1.10 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉంటారని 2022లో గుర్తించారు. ఇందులో 7.25 లక్షల మంది భారతీయులు ఉన్నట్టు అంచనా. వీరిలో వేలాదిమందిని ఇప్పటికే ఇండియాకు విమానాల్లో తరలించారు. కాళ్లకు గొలుసులతో భారతీయులను బంధించి పంపించడం వివాదాస్పదమైంది కూడా.
ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) కింద అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కారు మరో షాక్ ఇచ్చింది. స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో (ఎస్ఈవీఐఎస్) 15 రోజుల్లోగా ఉద్యోగ వివరాలను అప్డేట్ చేయాలని సూచించింది. లేదంటే స్వదేశానికి పంపించివేస్తామని హెచ్చరించింది. ట్రంప్ సర్కారు తాజా హెచ్చరికలతో 69 వేల మంది భారతీయ విద్యార్థులపై ప్రభావం పడనున్నది. కాగా ఓపీటీ రద్దుకు ట్రంప్ సర్కారు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టడం తెలిసిందే.