Trumps tariffs | ఎమర్జెన్సీ అధికారాలను ఉపయోగించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దిగుమతులపై విధించిన టారిఫ్‌లను ఆ దేశ ఫెడరల్ కోర్టు అడ్డుకున్నది. ప్రతి దేశంపైనా విస్తృత సుంకాలను విధించే అధికారం ట్రంప్‌కు లేదని ఫెడరల్ కోర్టు గురువారం తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. అయితే, సుంకాల విధింపు విషయంలో తాజాగా మరో యూఎస్ కోర్టు ట్రంప్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది.
ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ట్రంప్ సర్కార్ అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ట్రంప్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేసింది. దీనిపై జూన్ 5లోగా ఫిర్యాదుదారులు, జూన్ 9లోగా పరిపాలనాధికారులు స్పందించాలని ఆదేశించింది.
రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘లిబరేషన్ డే’ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలపై భారీస్థాయిలో సుంకాలు విధించారు (Trump Tariffs). అయితే, ఈ సుంకాల విషయంలో అధ్యక్షుడు ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ టారిఫ్‌లు (Trump Tariffs) అమలుకు యూఎస్ ట్రేడ్ కోర్టు (US Court) బ్రేకులు వేసింది. ప్రతి దేశంపైనా విస్తృత టారిఫ్‌లు విధించే అధికారాలు ట్రంప్‌కు లేవని తేల్చి చెప్పింది.
అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అధికారం ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఆందోళనకు గురిచేయడమే కాకుండా దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి దారితీసిన సుంకాలను రద్దు చేసింది. ట్రంప్ తన అధికార పరిధిని దాటి దేశ వాణిజ్య విధానాన్ని తన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా మార్చివేశారని ఆరోపిస్తూ భారీ సంఖ్యలో దాఖలైన కేసులపై విచారణ జరిపిన న్యూయార్క్‌లోని అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. విచారణ సమయంలో ‘భారత్-పాక్ ఉద్రిక్తతల (India-Pakistan Tensions)’ అంశాన్ని ట్రంప్ సర్కారు ప్రస్తావించగా.. కోర్టు దాన్ని తోసిపుచ్చింది.
Also Read..
New York | భారతీయ జంట పెండ్లి బరాత్‌తో హోరెత్తిన వాల్‌స్ట్రీట్..
Donald Trump | ‘అమ్మో’రికా.. వలస విధానాలపై ట్రంప్ కఠిన ఆంక్షలు
Birch Glacier | గ్రామాన్ని తుడిచిపెట్టేసిన హిమానీనదం.. వీడియో