New York | న్యూయార్క్: న్యూయార్క్‌లోని ఐకానిక్ వాల్‌స్ట్రీట్ ఓ భారతీయ జంట పెండ్లి బరాత్‌తో హోరెత్తింది. ఈ ర్యాలీలో 400 మంది నృత్యం చేస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. బంధుగణమంతా రంగురంగుల దుస్తులు ధరించి, బాలీవుడ్ పాటలకు స్టెప్పులేశారు. వధూవరులు కూడా ఈ వేడుకలో నృత్యం చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక ఫైనాన్షియల్ స్ట్రీట్‌లో ఈ వేడుక ఆహ్లాదం నింపింది. ఫైనాన్షియల్ హబ్ కాస్త నృత్యవేదికగా మారిందని, భారతీయ సంప్రదాయం ప్రపంచవేదికపై విరాజిల్లుతున్నదని పలువురు పేర్కొన్నారు. మరికొందరు ఇలాంటి ఆహ్లాదం, ఆనందం భారతీయులతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. వేడుక కొద్దిసేపట్లోనే ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్‌లో వైరల్‌గా మారింది. ఈ వేడుకను నిర్వహించిన డీజే ఏజే ఇన్‌స్టా పోస్ట్‌లో కామెంట్ చేస్తూ వాల్‌స్ట్రీట్‌లో ఇలాంటి నృత్యవేడుక జరుగుతుందని ఎవరూ ఊహించలేదని.. జీవితంలో ఒక్కోసారి ఇలాంటి అద్భుతాలు జరుగుతుంటాయని పేర్కొన్నారు.