Istanbul : టర్కీలోని ప్రధాన పట్టణమైన ఇస్తాంబుల్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద మంగళవారం దాడి జరిగింది. ముగ్గురు దుండగులు దాడికి యత్నించగా, వారిని అక్కడి భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం 12:15 గంటల సమయంలో జరిగింది. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇస్తాంబుల్‌లోని ఒక బిల్డింగులో, ఏడవ ఫ్లోర్లో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఉంటుంది. ఈ బిల్డింగ్ దగ్గర్లోనే దుండగులు దాడికి యత్నించారు.
కారులో ఆయుధాలతో వచ్చిన ముగ్గురు దుండగులు వచ్చిన వెంటనే అక్కడివారిపై కాల్పులు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, దుండగులపై ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఈ ఘటనలో ముగ్గురు దుండగులు మరణించారు. ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు. అయితే, ఘటన జరిగిన సమయంలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో ఇజ్రాయెల్ సిబ్బంది ఎవరూ లేరు. ఇక్కడేకాదు, టర్కీ రాజధాని అంకారాలోని రాయబార కార్యాలయంలో కూడా ఇజ్రాయెల్ సిబ్బంది ఎవరూ లేరు. టర్కీ సిబ్బంది మాత్రమే ఇక్కడ పని చేస్తున్నారు. ఇక, తాజా దాడి జరిగిన ప్రాంతం బాగా రద్దీగా ఉంటుంది. ఇక్కడ అనేక వ్యాపార, వాణిజ్య సముదాయాలు, నివాస స్థలాలు కూడా ఉంటాయి. వందల మంది ఈ ప్రాంతంలో ఉన్నారు. ఇలాంటి చోట దాడి జరగడం స్థానికంగా సంచలనం రేపింది.
ఈ దాడికి గల కారణాలు తెలియరాలేదు. టర్కీ ప్రతిష్టను దెబ్బతీయడమే వారి లక్ష్యం అయి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ దాడి ఘటనపై ఇజ్రాయెల్ స్పందించింది. తీవ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తున్నట్లు ప్రకటించింది. దాడి ఘటనపై వెంటనే స్పందించిన టర్కీ భద్రతా దళాలకు ఇజ్రాయెల్ ధన్యవాదాలు తెలిపింది. ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.