సోమవారం 18 జనవరి 2021
International - Dec 06, 2020 , 15:20:28

రైతు నిరసనలకు ట్రూడో మద్దతు : సమావేశం నుంచి వైదొలిగిన భారత్‌

రైతు నిరసనలకు ట్రూడో మద్దతు : సమావేశం నుంచి వైదొలిగిన భారత్‌

న్యూఢిల్లీ: భారతదేశంలో రైతుల నిరసనపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపనున్నాయి. కరోనావైరస్ మహమ్మారిపై కెనడా అధ్యక్షతన జరుగనున్న ప్రపంచ సమావేశం నుంచి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వైదొలిగారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం కెనడాకు తెలియజేశారు. అంతకుముందు గత నెలలో కొవిడ్19 పై జరిగిన 11 వ విదేశాంగ మంత్రిత్వ సమన్వయ బృంద సమావేశంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాల్గొన్నది. కొవిడ్ 19 ప్రపంచ విదేశాంగ మంత్రుల వ్యూహ సమావేశానికి భారతదేశం తొలిసారిగా అధికారికంగా హాజరైంది. ఈ సమావేశానికి బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, సింగపూర్‌, బ్రిటన్‌ దేశాలు హాజరయ్యాయి.

కొవిడ్ 19 మహమ్మారితో పోరాడటానికి వ్యూహాలను చర్చించడానికి డిసెంబర్ 7 సమావేశం ఏర్పాటుచేశారు. అయితే, "షెడ్యూల్ సమస్యల" కారణంగా తమ విదేశాంగ మంత్రిని సమావేశానికి పంపించడంలేదని న్యూఢిల్లీ నుంచి సమాచారం పంపారు. భారత్‌కు చెందిన రైతుల నిరసనలో కెనడా ప్రభుత్వం జోక్యం కారణంగా జైశంకర్ సమావేశాన్ని దాటవేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది. విదేశాంగ మంత్రి జైశంకర్‌ హాజరుకావడంలేదన్న సమాచారాన్ని భారత్‌లోని కెనడా రాయబారి నాదిర్ పటేల్‌కు అందించారు. జస్టిన్‌ ట్రూడో, అతని మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య సంబంధాలకు హాని కలిగిస్తున్నాయని, అలాగే భారత అంతర్గత వ్యవహారాలలో ఆమోదయోగ్యం కాని జోక్యం చేసుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. అయినప్పటికీ, శాంతియుత నిరసనలు, మానవ హక్కుల కోసం తమ దేశం నిలబడటం కొనసాగుతుందని కెనడా ప్రధాని పునరుద్ఘాటించారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు ఎరిన్ ఓ టూల్‌తో పాటు ఇతర కెనడా నాయకులు కూడా తమ ప్రధాని వ్యాఖ్యలను సమర్థించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.