Elon Musk | వాషింగ్టన్, అక్టోబర్ 20: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ టెస్లా అధినేత, ఎలాన్ మస్క్ ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల’(ఈవీఎం)పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు ఎన్నికలను ‘రిగ్గింగ్’ (ఫలితాన్ని ప్రభావితం) చేస్తున్నాయని, కృత్రిమ మేధ పరిజ్ఞానంతో ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చునని అన్నారు. బ్యాలెట్ పేపర్‌తో నిర్వహించటాన్ని, చేత్తో ఓట్ల లెక్కింపు ఎన్నికలను ఎలాన్ మస్క్ సమర్థించారు. పెన్సిల్వేనియాలో ఓ ప్రచార సభలో మస్క్ ప్రసంగిస్తూ, ‘నేను ఓ టెక్నాలజిస్ట్‌ను. కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌ను చాలా సులభంగా హ్యాక్ చేయవచ్చు’ అని అన్నారు. ఎన్నికల్లో ‘డొమినియన్’ కంపెనీ ఈవీఎంల వాడకాన్ని మస్క్ వ్యతిరేకించారు. దేశమంతా బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికల్ని నిర్వహించాలని అన్నారు.
మహా’ బరిలో జరాంగే అభ్యర్థులు
జాల్నా, అక్టోబర్ 20: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మరాఠాల ప్రాబల్యం ఉన్న చోట అభ్యర్థులను బరిలోకి దింపుతానని మరాఠా రిజర్వేషన్ల ఉద్యమ నేత మనోజ్ జరాంగే ఆదివారం ప్రకటించారు. ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరాఠా వర్గం గెలిచే అవకాశం ఉన్నచోట మాత్రమే మరాఠా అభ్యర్థులను పోటీలో నిలుపుతానన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానా ల్లో మరాఠా రిజర్వేషన్లను సమర్థించే అభ్యర్థులను తన బృందం బలపరుస్తుందన్నారు. మరాఠా సామాజిక వర్గం గెలిచే అవకాశం లేనిచోట మరాఠా రిజర్వేషన్లకు మద్దతిచ్చే అభ్యర్థులకు వారి పార్టీ, కులం, మతం గురించి పట్టించుకోకుండా మద్దతు ఇస్తామన్నారు. బలమైన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాలని, వారి అభ్యర్థిత్వంపై ఈ నెల 29న అంతిమ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరాఠా రిజర్వేషన్ ఉద్యమాన్ని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అణగదొక్కారని జరాంగే ఆరోపించారు.