న్యూయార్క్: హమాస్‌కు వార్నింగ్ ఇచ్చారు డోనాల్డ్ ట్రంప్(Donald Trump). ఒకవేళ గాజాలో సాధారణ పౌరులను హమాస్ టార్గెట్ చేస్తే, అప్పుడు హమాస్‌పై మిలిటరీ చర్యకు దిగుతామని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. ట్రుత్ సోషల్ అకౌంట్లో ట్రంప్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ ఒప్పందాన్ని ఉల్లంఘించి, గాజాలో సాధారణ ప్రజలను హమాస్ చంపితే అప్పుడు వాళ్లను చంపడం తప్ప తమ వద్ద ఆప్షన్ లేదన్నారు.
కొన్ని రోజుల క్రితం ఇజ్రాయిల్, హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. తమ వద్ద ఉన్న బందీలను ఇజ్రాయిల్‌కు హమాస్ అప్పగించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్‌లో పర్యటించిన ట్రంప్ ఆ దేశ పార్లమెంట్లో ప్రసంగించారు. మృతిచెందిన వారి అప్పగింతకు చెందిన అంశంపై ఓవల్ ఆఫీసులో ట్రంప్ స్పందించారు.
చాలా దారుణమైన పద్ధతి అని, వాళ్లు తొవ్వుతున్నారని, చాలా మంది మృతదేహాలను వెలికి తీస్తున్నారని, ఆ తర్వాత వాళ్లు ఆ మృతదేహాలను వేరు చేయాల్సి ఉంటుందన్నారు. కొందరి మృతదేహాలు చాన్నాళ్ల నుంచీ అక్కడే ఉంటున్నాయని, శిథిలాలను తొలగించి, ఆ తర్వాత ఆ శరీరాలను గుర్తించాల్సి ఉంటుందన్నారు. కొందరి శవాలు టన్నెల్స్‌లో ఉన్నట్లు చెప్పారు.