వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధంలో వరుస ఎదురు దెబ్బలు తగులుతుండటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహనం కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆదివారం ఇరాన్‌పై తీవ్ర పదజాలంతో హెచ్చరికలు చేశారు. హొర్ముజ్ జలసంధిని తెరువకపోతే ఇరాన్‌లోని పవర్ప్లాంట్లు, బ్రిడ్జిలను పేల్చివేస్తామని హెచ్చరించారు. ఇది యుద్ధంలో నిర్ణయాత్మక క్షణమని, మరో రెండు రోజుల్లో ఇరాన్‌పై దాడులను ఉధృతం చేస్తామని చెప్పారు. హొర్ముజ్‌ను తెరువాలంటూ ఇరాన్‌ను తీవ్ర పదజాలంతో దూషించారు. లేదంటే మీకు నరకం చూపిస్తానని హెచ్చరించారు. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని, ఒప్పందం కుదరకపోతే తీవ్ర పర్యవసనాలు ఎదుర్కొనవలసి వస్తుందని స్పష్టంచేశారు.
మరికొన్ని గంటల్లో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. చర్చలు విఫలమైతే ఇరాన్‌లోని కీలక సదుపాయాలను పేల్చివేస్తామని, ఇరాన్ చమురు వనరులను స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. 48 గంటల్లో హొర్ముజ్ తెరువాలంటూ తాను అల్టిమేటం జారీ చేసినా ఇరాన్ వెనక్కి తగ్గుతున్న సూచనలు కన్పించకపోవడంతో ట్రంప్ తాజా హెచ్చరికలు చేశారు. ఆదివారం గల్ఫ్‌లోని ఇంధన వసతులపై ఇరాన్ విరుచుకుపడింది.
ఇరాన్‌పై ఆదివారం అమెరికా భీకర దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన కీలక మిలిటరీ నాయకులు మరణించినట్టు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ‘టెహ్రాన్‌పై భీకర దాడులు జరిగాయి. ఇరాన్‌ను అవివేకంగా నడిపించిన అనేక మంది మిలిటరీ నాయకులు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు’ అని ట్రూత్ సోషల్‌లో ఆయన రాసుకొచ్చారు. అయితే వారు ఎవరన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. దాడికి సంబంధించిన వీడియోలను కూడా ఆయన పోస్ట్ చేశారు. అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ స్పందించలేదు.