వాషింగ్టన్, ఏప్రిల్ 7: కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుని, హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు స్థానిక కాలమానం ప్రకార మంగళవారం రాత్రి 8గంటలకు (భారతీయ కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ) ముగియనున్న నేపథ్యంలో ట్రంప్ తదుపరి చర్యలపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ గడువును మరోసారి పొడిగిస్తారా లేక చెప్పినట్లే పూర్తి స్థాయిలో కదన రంగంలోకి దూకుతారా అన్నది మరి కొన్ని గంటల్లో తేలిపోనున్నది.
గడువు ముగిసిపోక ముందే ఇరాన్‌కు వ్యూహాత్మకంగా అత్యంత కీలక చమురు కేంద్రమైన ఖర్గ్ ద్వీపంలోని 50 సైనిక లక్ష్యాలపై దాడులు నిర్వహించిన అమెరికా గడువు ముగిసిన తర్వాత ఇరాన్‌లోని పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశం ఉంది. అయితే మంగళవారం గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ట్రంప్ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. వినాశకర పర్యవసనాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరిస్తూ ఈ రాత్రి ముగిసేలోగా ఇరాన్ నాగరికత పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ రాత్రి ఒక నాగరికత మొత్తం అంతరించిపోతుంది. దాన్ని మళ్లీ ఎన్నటికీ పునరుద్ధరించలేరు. అలా జరగాలని నేను కూడా కోరుకోవడం లేదు. కాని బహుశా అదే జరుగుతుంది అని సామాజిక మాధ్యమం ట్రూత్‌సోషల్ పోస్టులో ట్రంప్ పేర్కొన్నారు. అయితే తన అంతిమ చర్యలేమిటో ఇప్పటికీ వెల్లడించని ట్రంప్.. పరిస్థితిని బట్టి చివరి నిమిషంలో దాడులను ఉపసంహరించుకునే అవకాశం ఉందని చెప్పారు.
ఇరాన్లో ఇప్పుడు సంపూర్ణ, సమగ్ర పాలన మార్పు వచ్చింది కాబట్టి భిన్నమైన, తెలివైన, తీవ్రవాద భావజాలం తక్కువ ఉన్న మనసులు విజయం సాధిస్తున్నాయి కాబట్టి బహుశా విప్లవాత్మకంగా అద్భుతమైనది ఏదైనా జరగవచ్చు అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ సుదీర్ఘ, సంక్లిష్ట చరిత్రలో ఈ రాత్రిని అత్యంత ముఖ్యమైన క్షణంగా ట్రంప్ అభివర్ణించారు. 47 ఏండ్ల దోపిడీ, అవినీతి చివరకు అంతం కానున్నాయని పేర్కొన్న ట్రంప్ ఇరాన్ ప్రజలను దేవుడు రక్షించుగాక అని పేర్కొన్నారు.
ఇరాన్‌కు ట్రంప్ ఇప్పటికి మూడుసార్లు గడువును పొడిగించారు. చివరిసారి పొడిగించిన గడువు మంగళవారం (ఏప్రిల్ 7) రాత్రి 8 గంటలకు ముగియనున్నది. మొదటిసారి ఇచ్చిన గడువు కేవలం ఐదు రోజులకు మాత్రమే. ఆ తర్వాత దాన్ని 10 రోజులకు పొడిగించారు. ఆ తర్వాతి గడువు నిజానికి సోమవారంతో ముగిసిపోవలసి ఉండగా దాన్ని మంగళవారం వరకు పొడిగించారు. ట్రంప్ మొదటగా చెప్పినది 48 గంటల గడువైతే అది ఇప్పటి వరకు 408 గంటల వరకు సాగింది. ట్రంప్ మొదటిసారి మార్చి 22న ఇరాన్‌కు గడువు ప్రకటిస్తూ తమ షరతులకు ఒప్పుకోకపోతే ఇంధన మౌలిక సదుపాయాలపై సైనిక దాడులు చేస్తామని హెచ్చరించారు.
మార్చి 23న గడువు ముగియడానికి ముందు మరో 5 రోజుల పాటు కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు ప్రకటించి గడువును మార్చి 28 వరకు పొడిగించారు. ఇరాన్‌తో మంచి, ఉత్పాదకతతో కూడిన చర్చలు జరుగుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. మార్చి 26న ట్వీట్ చేస్తూ సమయం మించిపోక ముందే నిర్ణయం తీసుకోవాలంటూ ఇరాన్‌ను హెచ్చరించి ఆ తర్వాత గడువును ఏప్రిల్ 6 రాత్రి 8 గంటల వరకు పొడిగించారు. చర్చలు బాగా సాగుతున్నాయని కూడా ఆయన తెలిపారు. అయితే ఏప్రిల్ 6న గడువును మరో 24 గంటలు పొడిగిస్తున్నట్లు ప్రకటించడంతో గడువు ఏప్రిల్ 7కు మారింది. సోమవారం పెట్టిన పోస్టులో ఇరాన్లో మంగళవారం విద్యుత్తు ప్లాంట్ రోజు, వంతెన రోజు. అన్నీ ఒక్కసారే తుడిచిపెట్టుకుపోతాయి అంటూ హెచ్చరించారు.
ఇరాన్ దేశాన్ని తుడిచిపెట్టేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన డెడ్‌లైన్‌ను ఇరాన్ ఖాతరు చేయలేదు. ఢీ అంటే ఢీ అంటూ తాము కూడా తగిన ప్రతీకారానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. యూఎస్ తమకు విధించిన బుధవారం డెడ్‌లైన్‌కు కొద్ది గంటలు మాత్రమే సమయం ఉన్న సమయంలో ఇరాన్ తీవ్ర నిర్ణయం తీసుకుంది. అమెరికాతో అన్ని దౌత్య మార్గాలకు, పరోక్ష చర్చలకు మార్గాలన్నీ మూసివేసినట్టు మంగళవారం స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం కారణంగా వాషింగ్టన్‌తో అన్ని సందేశాల మార్పిడిని తక్షణం నిలిపివేసినట్టు టెహ్రాన్ తెలిపింది. తాము విధించిన డెడ్‌లైన్‌లోగా కాల్పుల విరమణ ఒప్పందానికి రాకపోతే ఇరాన్ మొత్తం నాగరికత అంతరించిపోతుంది అంటూ ట్రంప్ హెచ్చరించిన క్రమంలో అమెరికా, దాని మిత్ర దేశాలను ప్రాచీన ఇరాన్ నాగరికత ఎన్నడూ మర్చిపోలేని విధంగా దెబ్బకొడుతుందని తీవ్రస్థాయిలో బదులిచ్చింది.
ఈ మేరకు దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ ఒక పోస్ట్ పెట్టింది. సైకో హెచ్చరికలను తాము లెక్కచేయబోమని తుర్కియేలోని ఇరాన్ ఎంబసీ వ్యాఖ్యానించింది. ‘చరిత్రలో ఎన్ని దాడులు జరిగినా ఇరాన్ నాగరితక ఇప్పటికే నిలిచే ఉందని పేర్కొన్నది. అలెగ్జాండర్ ఈ నాగరికతను తగులబెట్టాడు. మంగోలులు దోచుకున్నారు. కాలం ఎన్నో పరీక్షలు పెట్టింది. ఇరాన్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. కాలానికే ఎదురు నిలిచిన ఇరాన్ నాగరితను సైకో హెచ్చరికలు అంతం చేయలేవు’ అని పేర్కొన్నది.
‘నియంత్రణ ముగిసింది’ ఇక మేము అమెరికా, దాని భాగస్వాములకు చెందిన మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించింది. అమెరికా హద్దులు దాటితే పశ్చిమాసియా ఆవల ప్రాంతానికి కూడా యుద్ధాన్ని విస్తరింప చేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ హెచ్చరించింది. అంతేకాకుండా రానున్న కొద్ది సంవత్సరాల పాటు ప్రాంతీయ చమురు, గ్యాస్ సరఫరాలకు అంతరాయం కలిగిస్తామని పేర్కొన్నది. తమ వద్ద 15 వేల క్షిపణులు, 45 వేల డ్రోన్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది.
వాన్స్ వ్యాఖ్యలపై అనుమానాలు.. అదేమీ లేదంటూ వైట్‌హౌస్ వివరణ ఇరాన్ ఒప్పందం కుదుర్చుకోకపోతే మొత్తం నాగరికత ఈ రాత్రికి అంతం అవుతుందంటూ ట్రంప్ చేసిన తాజా హెచ్చరికలతో మళ్లీ అణు దాడి భయాలు నెలకొన్నాయి. ట్రంప్ ఈ మేరకు పోస్టు పెట్టిన కొన్ని నిమిషాల్లోనే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా అదే రీతిలో వ్యాఖ్యలు చేయడం పలు అనుమానాలకు తావిచ్చింది. గతంలో తాను ఎన్నడూ ఉపయోగించని సాధనాన్ని అమెరికా ఉపయోగిస్తుందని వాన్స్ హెచ్చరించారు. అణ్వాయుధాన్ని వాన్స్ ప్రస్తావిస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతుండగా అలాంటిదేమీ లేదంటూ వైట్ హౌస్ వివరణ ఇచ్చింది.
మంగళవారం సాయంత్రం బుడాపెస్ట్‌లో విలేకరులతో వాన్స్ మాట్లాడుతూ ట్రంప్ ఇచ్చిన గడువు ముగియక ముందే ఇరాన్ నుంచి సానుకూల స్పందన లభిస్తుందని అమెరికా ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇరాన్ సరైన నిర్ణయం తీసుకోకపోతే గతంలో వాడని సాధనాలను ఉపయోగించడంపై ట్రంప్ నిర్ణయం తీసుకోవచ్చని వాన్స్ చెప్పారు. మా దగ్గర కొన్ని అస్ర్తాలు ఉన్నాయని, వాటిని మేము ఇంతవరకు ఉపయోగించాలని నిర్ణయించుకోలేదని వారు తెలుసుకోవాలి. అమెరికా అధ్యక్షుడు వాటిని ఉపయోగించాలని నిర్ణయించుకోగలరు. ఇరానీయులు తమ ప్రవర్తనా తీరును మార్చుకోకపోతే ఆయన వాటిని పుపయోగించాలని నిర్ణయించుకుంటారు అని వాన్స్ వ్యాఖ్యానించారు.