Donald Trump : హార్ముజ్ జలసంధి వద్ద భారత నౌకలపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి ఇరాన్ పనే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత నౌకలపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసిందని, ఈ దాడి ఆమోదయోగ్యం కాదని ట్రంప్ అన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా శుక్రవారం స్పందించారు. ఇంతవరకు భారత నౌకలపై దాడి చేసింది అమెరికానే అని ప్రచారం జరిగింది.
దీనిపై ఇటు అమెరికా, అటు ఇరాన్ అధికారికంగా స్పందించలేదు. కానీ, తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. గత రాత్రి భారత నౌకపై జరిగిన ఈ దాడికి కారణం ఇరాన్ అన్నారు. ఇరాన్ డ్రోన్లతో దాడి చేసిందని, ఈ దాడిని ట్రంప్ ఖండించారు. మరోవైపు అమెరికాతో ఒప్పందం కుదిరిందని ఇరాన్ తప్పుడు ప్రచారం చేస్తోందని ట్రంప్ విమర్శించారు. ఈ విషయంలో ఇరాన్ తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. భారత వాణిజ్య నౌకలపై జరిగిన దాడిలో 21 మందిని సహాయక బృందాలు రక్షించగా, ముగ్గురు మరణించారు. రెండుసార్లు భారత నౌకలపై దాడి జరిగింది. ఈ దాడికి కారణం అమెరికానే అని భావించిన భారత ప్రభుత్వం అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసింది. అది కూడా రెండుసార్లు సమన్లు ఇచ్చింది.
ఇదే సమయంలో ట్రంప్ స్పందించడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా దాడి చేస్తోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడి చేస్తోంది. హార్ముజ్ జలసంధి వద్ద చిక్కుకుపోయిన నౌకలపై జూన్ 8న తొలిసారి దాడి జరిగింది. ఆ తర్వాత గురువారం మరోసారి దాడి జరిగింది. ఈ దాడులు అమెరికానే చేసిందనే ప్రచారం మొదలైంది.