న్యూఢిల్లీ: కరడుగట్టిన నేరస్తుల్లా చేతులు, కాళ్లకు సంకెళ్లు.. సరుకుల రవాణాకు ఉపయోగించే సైనిక విమానాల్లో వారిని మూటల్లా కుక్కేసి సుమారు 30 గంటలకు పైగా ప్రయాణం.. ఇది మన దేశ వలసదారుల తరలింపుపై అమెరికా చూపిన అమానుష వైఖరి. ఒక వైపు భారత్‌తో తమకు స్నేహ సంబంధాలున్నాయని చెప్పుకునే అమెరికా… మనవారిని అవమానకరంగా, అమానవీయంగా మన దేశానికి పంపింది. అమెరికా తీరుపై భారత్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. అటు విపక్షాలు, వివిధ వర్గాలు అగ్రరాజ్యం తీరును తప్పుబట్టాయి. ఉభయ సభల్లోనూ దీనిపై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్రాన్ని నిలదీశాయి.
భారతీయులకు సంకెళ్లు వేసి ఉన్న వీడియోలు బుధవారమే వైరల్ కాగా, అవి భారతీయులవి కావని కేంద్రం బుకాయించింది. అయితే గురువారం స్వయంగా బాధితులే తమకు బేడీలు వేసి అమానుషంగా విమానంలో తీసుకువచ్చారని, దారిలో చిత్రహింసలు పెట్టారని ఆరోపించడంతో నిజాలు వెలికివచ్చాయి. తమను విమానం ఎక్కించే వరకు ఎక్కడికి వెళ్తున్నామో కూడా చెప్పలేదని తెలిపారు. ఇంత జరిగినా అమెరికా వైఖరిపై కేంద్రం పల్లెత్తు మాట కూడా అనకపోవడం, పైగా వారి చర్యను చట్టసభలో కేంద్ర మంత్రే సమర్థించడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నది. కొలంబియా లాంటి దేశంకు ఉన్న తెగువ, ధైర్యం మన మోదీకి లేవా అని ఈ సందర్భంగా విపక్ష నేతలు బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశాయి.
అమెరికా నుంచి సైనిక విమానం ద్వారా తొలివిడతగా భారత్ చేరుకున్న 104 మంది వలసదారులలో 19 మంది మహిళలు, 13 మంది మైనర్లు కూడా ఉన్నారు. వీరిలో నాలుగేండ్ల బాలుడు, ఐదు, ఏడేండ్ల వయసున్న బాలికలు ఉన్నారు. వారిలో ఉన్న జస్పాల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తాము విమానంలో ప్రయాణిస్తున్నంత సేపూ తమ కాళ్లూ, చేతులూ సంకెళ్లతో బంధించారని, విమానం అమృత్‌సర్‌లో ల్యాండయిన తర్వాత మాత్రమే వాటిని తొలగించారని తెలిపాడు. తాను కూడా ఏజెంట్‌కు రూ.30 లక్షలు ఇచ్చానని చెప్పాడు. తొలుత తనను బ్రెజిల్ తీసుకుని వెళ్లారని, జనవరి 24న అమెరికా సరిహద్దు పెట్రోలింగ్ సిబ్బంది తనను అరెస్ట్ చేసేవరకు అక్కడ ఆరు నెలలు ఉన్నానని వెల్లడించాడు. వలసదారుల్లో ఉన్న తన కుమార్తె గురించి కనూభాయి పటేల్ అనే మహిళ మాట్లాడుతూ నెల రోజుల క్రితం తన కుమార్తె తన స్నేహితులతో కలిసి యూరప్ వెళ్లిందని, అక్కడి నుంచి అమెరికా ఎలా వెళ్లిందో తనకు తెలియదని అన్నారు.
తమ దేశం, ప్రజల భద్రత కోసం ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేయడం అవసరమని, అది తమ విధానమని యూఎస్ స్పష్టం చేసింది. విమాన ప్రయాణం గురించి అంతకు మించి చెప్పలేమని వ్యాఖ్యానించింది. కాగా, భారత్‌కు చెందిన 104 మంది వలసదారుల కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి ఉన్న వీడియోను యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటక్షన్ (యూఎస్బీపీ) చీఫ్ మైఖేల్ బ్యాంక్స్ విడుదల చేశారు.
భారత వలసదారుల చేతులు, కాళ్లకు సంకెళ్లు వేసి ఉన్న చిత్రాలు వైరల్ కావడంతో కేంద్ర వైఖరిపై పలువురు విమర్శలు గుప్పించారు. ఇది రాజకీయ వివాదానికి దారి తీయడంతో ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేపట్టింది. నిజ నిర్ధారణ చేపట్టి అవి ఫేక్ అని తేల్చింది. ఆ ఫొటోల్లో ఉన్న వారు భారతీయులు కాదని, గ్వాటమాకు పంపిస్తున్న వలసదారులని పేర్కొంది.