న్యూఢిల్లీ: ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం తీవ్రమవుతూ ప్రపంచ ఇంధన మార్కెట్లకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో మరికొంత సమయం ఉంటే హొర్ముజ్ జలసంధిని అమెరికా తిరిగి తెరవగలదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కీలకమైన సముద్ర మార్గాన్ని, దాని చమురు ప్రవాహాన్ని అమెరికా తన నియంత్రణలోకి తీసుకోగలదని ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ శుక్రవారం పేర్కొన్నారు. మరికొంత సమయం ఉంటే మనం హొర్ముజ్ జలసంధిని సులభంగా తెరిచి, చమురును తీసుకుని, భారీగా లాభాలు గడించవచ్చు అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.
ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ ప్లాంట్లను పేల్చివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం రాత్రి హెచ్చరించారు. ఇరాన్లో మిగిలిన మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడాన్ని అమెరికా సైన్యం ఇంకా చేపట్టలేదని, ఇక తదుపరి టార్గెట్ వంతెనలు, పవర్ ప్లాంట్లేనని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. ఏం చెయ్యాలో.. ఎంత త్వరగా చేయాలో ఇరాన్ నాయకత్వానికి ఇక బాగా తెలుసని కూడా ట్రంప్ తన పోస్టులో వ్యాఖ్యానించారు. గతంలో యుద్దానికి సంబంధించిన గడువులు, లక్ష్యాలను మార్చిన ట్రంప్ బుధవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ అమెరికా షరతులకు ఇరాన్ అంగీకరించపోతే యుద్ధం తీవ్రరూపం దాలుస్తుందని హెచ్చరించారు. ఇరాన్‌లోని ఇంధన, చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని కూడా స్పష్టం చేశారు.
ఇరాన్‌పై అమెరికా సైనిక దాడులు యుద్ధ నేరాలుగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంటూ అమెరికాలోని పలువురు అంతర్జాతీయ న్యాయ నిపుణులు తమ సంతకాలతో ఓ బహిరంగ లేఖను గురువారం రాత్రి విడుదల చేశారు. మానవతా ప్రవర్తనపై 1949 జెనీవా ఒప్పందం ప్రకారం పౌరులకు అత్యవసరమైన ప్రదేశాలపై దాడులు చేయడం యుద్ధంలో నేరంగా పరిగణిస్తారు. సైనిక దాడుల్లో నిమగ్నమయ్యే పక్షాలు పౌర ప్రదేశాలు, సైనిక లక్ష్యాల మధ్య తేడాలను గుర్తించాలని జెనీవా ఒప్పందాలు, అదనపు నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. పౌర ప్రదేశాలపై దాడులు జరపరాదని ఈ ఒప్పందాలు నిర్దేశిస్తున్నాయి.