ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Jul 22, 2020 , 10:23:35

చైనా వైర‌స్ చాలా ప్ర‌మాద‌క‌రం: ట‌్రంప్‌

చైనా వైర‌స్ చాలా ప్ర‌మాద‌క‌రం: ట‌్రంప్‌

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ నిర్దారణ పరీక్షల నిర్వహణలో అమెరికా ముందున్న‌ద‌ని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ఇప్పటివరకు అమెరికాలో మొత్తం 50 మిలియన్ల మందికి పరీక్షలు నిర్వహించామని ఆయ‌న చెప్పారు. అమెరికా తర్వాత అత్య‌ధికంగా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేసింది భారత్‌లోనేన‌ని ట్రంప్ పేర్కొన్నారు. భార‌త్‌లో 12 మిలియన్‌ల‌కుపైగా‌ టెస్టులు జరిగాయని చెప్పారు. దేశంలో క‌రోనా ప‌రిస్థితుల‌పై మంగ‌ళ‌వారం వైట్‌హౌస్‌లో నిర్వ‌హించిన కాన్ఫ‌రెన్స్‌లో ట్రంప్ మాట్లాడారు. 

కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా దురదృష్టవశాత్తూ కొన్ని చోట్ల పరిస్థితులు చేజారిపోయాయని ట్రంప్ అసహనం వ్యక్తంచేశారు. యువతలో చాలా మందికి కరోనా వచ్చినా లక్షణాలు బయపడటం లేదని, అనారోగ్యం బారినప‌డ్డ‌ట్లు కూడా వారికి తెలియ‌డంలేద‌ని, కాబట్టి యువత బాధ్యతగా మెల‌గాల‌ని ట్రంప్‌ సూచించారు. కరోనాతో మరణించే చిన్నారుల సంఖ్య త‌క్కువ‌గానే ఉంటుండ‌టం కొంత ఊరట కలిగించే విషయమని పేర్కొన్నారు. 

క‌రోనాపై యుద్ధంలో ప్రతి దశను, చికిత్సా విధానాలను ప్రపంచ దేశాలతో పంచుకుంటున్నామని, సమిష్టిగా పోరాడి మహమ్మారిని ఓడిస్తామని ట్రంప్‌ ధీమా వ్యక్తంచేశారు. చైనా వైరస్‌ విషపూరితమైన‌ద‌ని, చాలా హానికరమైన‌దని‌ ఈ సందర్భంగా ఆయ‌న వ్యాఖ్యానించారు. 'చైనాలో భయంకరమైన అంటువ్యాధి ప్రబలింది. వారు మాత్రం దాన్నుంచి తప్పించుకున్నారు. కానీ అది ప్రపంచం మొత్తం విజృంభించింది. ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న‌ది' అని ట్రంప్ చైనాను విమ‌ర్శించారు. 

అంతేగాక 'క‌రోనా మ‌హ‌మ్మారితో మేం ధైర్యంగా పోరాడుతున్నాం. ఇతర దేశాలకూ ఎంతో సాయం చేస్తున్నాం. కరోనా కారణంగా మరణించిన వారి కోసం మేం ఎంతగానో దుఃఖిస్తున్నాం. వారి గౌరవార్థం వ్యాక్సిన్‌ తీసుకువచ్చి వైరస్‌ను అంతం చేస్తాం' అని ట్రంప్‌ పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo