e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Advertisement
Home బతుకమ్మ అకళంక చరితులు..కాకతీయులు

అకళంక చరితులు..కాకతీయులు

అకళంక చరితులు..కాకతీయులు

కాకతీయుల పాలన, వారి నిర్మాణాలు, చేపట్టిన అభివృద్ధిని తెలుపుతూ అనేక శాసనాలు వెలుగుచూశాయి. వాటిలో దేవనాగరి, సంస్కృతం, తెలుగన్నడ, తెలుగు లిపిలో చెక్కించినవే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ, ‘రెడ్లవాడ’లో లభించిన శాసనం అరుదైంది. ‘నందినాగరి’ లిపిలోని ఈ శాసనం, కాకతీయుల వంశచరిత్రను వివరిస్తున్నది. వారు కళంకరహితులని కీర్తిస్తున్నది.
వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ మండలంలోని ‘రెడ్లవాడ’ అనేక చారిత్రక ఆనవాళ్లకు నెలవు. గ్రామానికి దక్షిణం వైపున ఉన్న నల్లగుట్ట పరిసరాల్లో పదులసంఖ్యలో రాళ్ల సమాధులు కనిపిస్తున్నాయి. వర్తులాకార బంతిలా ఉండే వీటిని స్థానికులు ‘రాక్షసగూళ్లు’గా పిలుస్తున్నారు. వీటి పరిసరాల్లో ఎరుపు రంగు కుండల పెంకులు, రాతి పనిముట్లు, చేతి గొడ్డళ్లు, వడిసెల గుండ్లు లభించాయి. క్రీ.పూ. 3000 నుంచి క్రీ.పూ.1500 మధ్య కాలంలోని కొత్త రాతియుగానికి చెందిన మానవులు వీటిని వాడినట్టు పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

జ్వాలామాలిని శిల్పం
ఎస్సారెస్పీ కాలువ సమీపంలోని రాతిగుండుకు మహాకాళి రూపంలో అమ్మవారి శిల్పం చెక్కి ఉన్నది. దేవతకు 12 చేతులుండగా ప్రతి చేతిలోనూ ఆయుధాలున్నాయి. ఆ చేతుల్లో దానపాత్ర, రెండు బాణాలు, చక్రం, త్రిశూలం, పాశం, పతాకం, కలశం, కత్తి దర్శనమిస్తాయి. పాదాలకింద రాక్షసుల తలలున్నాయి. ఈ అమ్మవారిని గ్రామస్తులు ‘గంగమ్మ తల్లి’ పేరుతో కొలుస్తున్నారు. ఈ శిల్పంలోనే మహిషం(దున్నపోతు), దేవతకు మొక్కులు చెల్లిస్తున్నట్టుగా భక్తుల శిల్పాలు చెక్కి కనిపిస్తున్నాయి. ఈ శిల్పం 24మంది జైనతీర్థంకరుల్లో ఎనిమిదవ తీర్థంకరుడైన చంద్రప్రభు శాసనదేవత, జ్వాలామాలిని శిల్పంగా పరిశోధకులు భావిస్తున్నారు. కరువు సమయంలో ఇక్కడ పూజలు చేస్తే, సమృద్ధిగా వానలు పడుతాయని స్థానికులు బలంగా నమ్ముతుంటారు.

ఆలయాల సముదాయం
రెడ్లవాడ గ్రామం మధ్యలో మూడు బురుజులు, పాత మట్టిగోడలు ఉన్నాయి. బురుజుల్లో దేవాలయ స్తంభాలు, శిల్పాలు కనిపిస్తున్నాయి. బురుజు మధ్యభాగంలోని ఆలయ శిథిలాల్లో వైష్ణవ ద్వారపాలకుడి శిల్పం ఉన్నది. గ్రామంలోనూ లక్ష్మీనారాయణుడి ఆలయం ఉన్నది. గ్రామానికి తూర్పున మర్రికుంట దగ్గర్లో శిథిలదేవాలయ ఆనవాళ్లున్నాయి. అక్కడక్కడా కనిపిస్తున్న శిథిలాల (దేవాలయాలు, శిల్పాల) ద్వారా పూర్వం ఇక్కడ దేవాలయాల సముదాయం ఉండేదని తెలుస్తున్నది. గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆంజనేయుని గుడిలో కాకతీయ కాలం నాటి చాముండి, వినాయకుల విగ్రహాలున్నాయి. ధ్వజస్తంభం మీద ఆంజనేయుడు, గరుడ, విష్ణువు, వినాయకుడు మొదలైన దేవతా మూర్తులతోపాటు హంసల శిల్పాలూ దర్శనమిస్తున్నాయి.

నందినాగరి శాసనం
గ్రామంలో ఒక అడుగు వెడల్పు, నాలుగు అడుగుల పొడవున్న నల్లరాతి శాసనస్తంభ శకలం దొరికింది. దానిమీద నాలుగు దిక్కులా దేవనాగరి లిపికన్నా పురాతనమైన ‘నంది నాగరి’ లిపిలో శాసనం ఉన్నది. తెలంగాణలో నంది నాగరి లిపిలో శాసనాలు చాలా అరుదుగా లభించాయి. కొలనుపాకలోని వీరనారాయణ స్వామి దేవాలయం, ఆదిలాబాద్‌లోని జైన దేవాలయంలో మాత్రమే ఈ తరహా శాసనాలున్నాయి. రెడ్లవాడ సమీపంలోని ఇనుగుర్తిలో మైలమ వేయించిన మరో శాసనం కూడా నంది నాగరి లిపిలోనే ఉండటం విశేషం. అయితే, కాకతీయుల కాలం నాటి శాసనాలలో ఎక్కువగా దేవనాగరి, సంస్కృతం, తెలుగన్నడ, తెలుగు లిపిలో ఉన్నాయి.

శాసన వివరాలు
రాజవంశం : కాకతీయ
రాజు : గణపతిదేవ చక్రవర్తి
కాలం : వివరాలు లభించలేదు
భాష : సంస్కృతం, తెలుగు
లిపి : నంది నాగరి
గణపతి స్తుతితో మొదలైన ఈ శాసనంలో.. “రాజులు విష్ణుమూర్తి భుజాలనుంచి పుట్టినవారు. గణపతిదేవుని వంశం కళంకరహితమైనది. కాకతీయులు గొప్ప ప్రతాపం గలవారు” అని ఉన్నది. మహాదేవుడు, రుద్రదేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవి, మైలమ పేర్లూ ప్రస్తావించారు. “మైలమకు సత్పుత్రులు.. అంటే మంచి కుమారులు కలరు. గణపతిదేవుని అగ్రపుత్రియైన రుద్రమకు చాళుక్య రాజైన వీరభద్రుడితో వివాహం జరిపించారు. ఆ సందర్భంగా మల్లయార్యుడు అనే యజ్ఞకర్త చేతులమీదుగా యజ్ఞం చేశారు” అని రాసి ఉన్నది. ప్రోలీదుడు, వసు, వాద్యకుడు, మాధవుడు, సుధీరన్న, కొమ్మయ, సోమనాథుడు, శ్రీరాముడు, ప్రోలయ, భరద్వాజుడు, విద్ధన మొదలైనవారి పేర్లూ ఈ శాసనంలో ఉన్నాయి.
ఈ గ్రామంలో యాగం జరిగిందనీ, ఆ సందర్భంగా తూర్పున చనుప వేగిలి, గుడ్లచేను, గుండిరడి చెరువు, మోదలి వాగు అవతల నీర్నేలను, దోన గుబ్బలి, మారమరాజు చేను, మాచగుడ్డము, గణప సముద్రము, పుట్ట రాయిగడ్డ, చీమలరేగడి, బయ్యన కుంట, రేచబోయని కుంటల మధ్యలోని భూమిని శివాలయ ఆలయ కైంకర్యాలు, ధూపదీప నైవేద్యాల కోసం దానం చేసినట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తున్నది.

-అరవింద్‌ ఆర్య ,7997 270 270

ఇవీ కూడా చదవండి…

రిజిజుకు కరోనా

అన్నదాత..ఆరోగ్య కేకులు!

తెలంగాణచేపల పులుసు

Advertisement
అకళంక చరితులు..కాకతీయులు

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement