e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, May 17, 2021
Home బతుకమ్మ పేదరాలి బయోపిక్‌!.. మనోడు సినిమా తీశాడు

పేదరాలి బయోపిక్‌!.. మనోడు సినిమా తీశాడు

పేదరాలి బయోపిక్‌!.. మనోడు సినిమా తీశాడు

67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బయోపిక్‌లదే హవా! స్పెషల్‌ మెన్షన్ విభాగంలో ‘లతా భగవాన్‌ కరే’ అనే సినిమా! అదొక మరాఠా పేదరాలి జీవనచిత్రం. భారతీయ చలనచిత్ర పరిశ్రమంతా చర్చించుకుంటున్న ఈ చిత్రాన్ని ఓ తెలంగాణ బిడ్డ నిర్మించాడు.

కరీంనగర్‌ జిల్లా మానకొండూరు. దేశబోయిన నవీన్‌ పదో తరగతి విద్యార్థి. బోర్డ్‌ ఎగ్జామ్స్‌ దగ్గర పడుతున్నాయి. కానీ, నవీన్‌ దృష్టిలో టాలెంట్‌ ముఖ్యం. మార్కులు, ర్యాంకులు కాదు. అందరూ ప్రిపరేషన్లో మునిగిపోయారు. ‘నాకు ఈ పరీక్షలొద్దూ.. ఈ చదువొద్దు’ అనుకున్నాడు. ఒకరాత్రి ఎవరికీ చెప్పకుండా ఇంట్లోనుంచి పారిపోయాడు.

సినిమా తీశాడు!
ఏండ్లు గడిచాయి. నవీన్‌ ఎటు వెళ్లాడో, ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియలేదు. స్నేహితులుకూడా ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయి నవీన్‌ గురించి మరచిపోయారు. 2020 జనవరి 17. ఒక మరాఠీ సినిమాలో ‘ఎ ఫిల్మ్‌ బై నవీన్‌ దేశబోయిన’ అని కనిపించింది. మానకొండూరులో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సినిమా సంచలనం రేపింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. మన రాష్ట్రం కాదు. మన చిత్ర పరిశ్రమ కాదు. మన భాష కాదు. కానీ, పేదరికం అందరిది కదా? ఆకలి కూడా అందరిది కదా? అనే పాయింట్‌తో తీసిన అద్భుతమైన సినిమా అది.

అసలు కథేంటి?
ఇదొక పేదరాలి బయోపిక్‌. కుటుంబాన్ని పోషించేందుకు ఒక పేద మహిళ ఏ విధమైన సమస్యలను ఎదుర్కొని గెలిచిందో చూపించే సినిమా. తన జీవితకథ ఆధారంగా తీసిన సినిమాలో తానే నటించిన మహిళ లత. ఆమె భర్త భగవాన్‌. నిజజీవితంలో అనుభవించిన సవాళ్లనే సినిమాగా మలిచారు. లతది మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని పెంప్లీ గ్రామం. లత, భగవాన్‌ ఇద్దరూ కూలీపని చేసేవాళ్లు. వీరికి నలుగురు ఆడపిల్లలు. అప్పుసప్పు చేసి పిల్లల పెండ్లిళ్లు చేశారు. ఈ అప్పు తీర్చాలి కదా? రెండు మూడేండ్లు బాగా కష్టపడి ఎవరి డబ్బులు వాళ్లకు ఇవ్వాలనుకున్నారు. కానీ, విధి వెక్కిరించింది. ఉన్నట్టుండి భగవాన్‌ అనారోగ్యం పాలయ్యాడు. మంచానికే పరిమితం. ఇక చేసేది లత ఒక్కరే. అందులోనూ ఆడమనిషాయె. పరేషాన్‌తో ఉన్న లతకు ఒక పేపర్‌ ప్రకటన ఊరటనిచ్చింది.

వాళ్లింట్లోనే..
‘మూడు మీటర్ల పరుగు పందెంలో పాల్గొనండి. మూడువేల రూపాయలు గెల్చుకోండి. శరత్‌ మారథాన్‌ మీకు మంచి అవకాశం కల్పిస్తోంది’ అనేది ఆ ప్రకటన సారాంశం. లతకు ఆశ కలిగింది. పరుగు పందెంలో గెలిచి భర్తను కాపాడుకోవాలనుకున్నది. అప్పుడామె వయసు 65 సంవత్సరాలు. పరుగుపందెం నిర్వాహకులు వద్దన్నారు. బతిమిలాడుకుంది. తన పరిస్థితిని వివరించింది. మారథాన్‌ నిర్వాహకులు దయదలిచారు. 2013 డిసెంబర్‌ 17న మూడు కిలోమీటర్ల శరత్‌ మారథాన్‌లో విజయం సాధించి మూడు వేల రూపాయలు గెల్చుకుంది. ఇలా వరుసగా మూడుసార్లు విజయం సాధించి భర్త ఆరోగ్యాన్ని కాపాడుకుంది లత. తర్వాత ఆమె గురించి వార్తా పత్రికల్లో, టీవీల్లో కథనాలు వచ్చాయి.

నవీన్‌ అప్పటికే తస్లీమా నస్రీన్‌ ‘లజ్జ’ నవల ఆధారంగా సినిమా రూపొందించినప్పటికీ తెరపైకి రాలేదు. మరో మంచికథకోసం ఎదురుచూస్తున్న సమయంలో లతా భగవాన్‌ గురించి తెలిసింది. ఆమెను కలిసేందుకు చాలా ప్రయాసకోడ్చాడు. లత కుటుంబ పరిస్థితిని ప్రత్యక్షంగా చూసి కన్నీరు పెట్టుకున్నాడు. వారి జీవితాన్ని సినిమాగా చిత్రీకరిస్తానని చెప్పాడు. కానీ, వాళ్లు వినలేదు. నవీన్‌ పట్టు వదల్లేదు. కొద్దిరోజులు వారితోనే ఉంటూ నమ్మకం ఏర్పరచుకున్నాడు. మొత్తానికి వాళ్లను ఒప్పించగలిగాడు. సినిమా విడుదలయ్యాక ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. బ్రిటిష్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ వాళ్ల దృష్టికి వెళ్లడంతో ‘లతా భగవాన్‌ కరే’ అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించింది. తాజాగా 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ‘స్పెషల్‌ మెన్షన్‌ అవార్డ్‌’ దక్కడం పట్ల నవీన్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

ఇవీ కూడా చదవండి…

అకళంక చరితులు..కాకతీయులు

వాక్సినేషన్‌లో కామారెడ్డి ఫస్ట్‌

అన్నదాత..ఆరోగ్య కేకులు!

Advertisement
పేదరాలి బయోపిక్‌!.. మనోడు సినిమా తీశాడు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement