వాషింగ్టన్, జూలై 8: ‘బ్రిక్స్’ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ కన్నెర్ర చేశారు. బ్రిక్స్ కూటమిలో భారత్ కొనసాగాలనుకుంటే 10శాతం అదనపు సుంకాన్ని అమెరికాకు కట్టాల్సి ఉంటుందని బెదిరింపులకు దిగారు. మంగళవారం ఆయన వాషింగ్టన్లో మీడియాతో మాట్లాడుతూ, బ్రిక్స్ దేశాల కూటమి డాలర్‌ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. బ్రిక్స్ కూటమిలో సభ్య దేశంగా భారత్ ఎక్కువకాలం కొనసాగలేదని అన్నారు. ‘సుంకాలు లేకుండా ప్రభుత్వానికి వాణిజ్యం చేసే హక్కు లేదు. ఇతర దేశాలు మాపై వసూలు చేసేదానికంటే చాలా తక్కువగా సుంకాన్ని విధిస్తున్నాం’ అని ట్రంప్ అన్నారు. కానీ ఇతర దేశాలు తమపై విధిస్తున్న ప్రతీకార సుంకాలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. బ్రిక్స్‌లోని భారత్ సహా ఇతర సభ్య దేశాలపై 10% అదనపు సుంకాన్ని విధిస్తామన్నారు.
ట్రంప్ మరో టారిఫ్ బాంబ్ పేల్చారు. తమతో ఒప్పందం చేసుకోని 14 దేశాలపై ఆగస్టు 1 నుంచి కనీసం 25 శాతం పన్ను విధించనున్నట్టు చెప్పారు. ఈ మేరకు పన్ను విధించే దేశాల జాబితాను వైట్ హౌస్ విడుదల చేసింది. దీంట్లో ఆ దేశ కీలక మిత్ర దేశాలైన దక్షిణ కొరియా, జపాన్ కూడా ఉన్నాయి. ప్రపంచ దేశాలు తమ దేశీయ ప్రయోజనాలను తీర్చేలా ఉండే స్థిరమైన ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న వేళ ట్రంప్ తాజా పన్ను విధింపు నిర్ణయం ప్రపంచ వాణిజ్యానికి ప్రమాదక మలుపు అయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్‌లో ప్రకటించిన పన్ను శాతం స్థానంలో కొత్త పన్ను శాతం ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది.