వాషింగ్టన్, మార్చి 4 : ఉక్రెయిన్‌కు అమెరికా సైనిక సహాయాన్ని తాత్కాలికంగా తక్షణమే నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వైట్ హౌస్‌లోని అధ్యక్ష కార్యాలయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వాగ్యుద్ధం జరిగిన మూడు రోజులకే ట్రంప్ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. ఉక్రెయిన్‌కు తాత్కాలికంగా సైనిక సహాయాన్ని పూర్తిగా నిలిపివేయాలని, ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ట్రంప్ ఆదేశించినట్టు అమెరికా ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరిని ఉటంకిస్తూ ది న్యూయార్క్ టైమ్స్ మంగళవారం తెలిపింది. అమెరికా అధ్యక్షుడికి, జాతీయ భద్రతా విభాగానికి చెందిన సీనియర్ నాయకులకు మధ్య వరుస సమావేశాల అనంతరం ఈ నిర్ణయం వెలువడినట్టు పత్రిక తెలిపింది. రష్యాతో శాంతి చర్చలకు ఉక్రెయిన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోనంతవరకు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమలులో ఉంటుందని ఆ అధికారి వెల్లడించినట్లు పత్రిక తెలిపింది. అమెరికా రక్షణ కంపెనీల నుంచి నూతన సైనిక పరికరాలను ఉక్రెయిన్ కొనుగోలు చేయడానికి ఉద్దేశించిన లక్షల కోట్ల డాలర్ల భద్రతా సాయం కూడా ట్రంప్ ఉత్తర్వుల ఫలితంగా నిలిచిపోయినట్టు పత్రిక వివరించింది.
రష్యా డిమాండ్లకు తాము తలొగ్గే పరిస్థితిని కల్పించేందుకే తమకు అన్ని రకాల సైనిక సహాయాన్ని ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిందని ఉక్రెయిన్ సీనియర్ పార్లమెంట్ సభ్యుడు ఒకరు స్పష్టం చేశారు. ఇప్పుడు సైనిక సాయాన్ని నిలిపివేయడమంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సాయపడడమేనని ఉక్రెయిన్ పార్లమెంటరీ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ ఒలెక్సాండర్ మెరెజ్కో తెలిపారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం చాలా బాధాకరమని, రష్యా డిమాండ్లకు తాము తలొగ్గాలన్న ఉద్దేశం ఇందులో దాగి ఉందని ఆయన చెప్పారు. మానసికంగా, రాజకీయంగా ఉక్రెయిన్‌కు చావు దెబ్బని ఆయన వర్ణించారు. ఇది తమ స్ఫూర్తికి ఏమాత్రం దోహదపడదని ఆయన చెప్పారు. జెకొస్లోవేకియాలోని కొంత భాగాన్ని నాజీ జర్మనీ కలుపుకోవడానికి అనుమతినిస్తూ జరిగిన 1938 నాటి మ్యూనిచ్ ఒప్పందంతో తాజా పరిణామాన్ని ఆయన పోలుస్తూ మ్యూనిచ్ కన్నా ఇది అత్యంత దారుణమైనదని చెప్పారు. అక్కడ జెకోస్లోవేకియాను దురాక్రమణదారుగా చిత్రీకరించే ప్రయత్నం జరగలేదని, కాని ఇప్పుడు బాధిత దేశాన్ని దురాక్రమణదారుగా ఆరోపిస్తున్నారని, ఇది అత్యంత ప్రమాదకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.