న్యూఢిల్లీ, మే 6: ప్రపంచ దేశాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ‘అమెరికా-ఇరాన్’ యుద్ధం విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. యుద్ధం ముగింపుపై అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో మరో 48 గంటల్లో ఇరాన్ యుద్ధానికి ‘ఎండ్ కార్డ్’ పడుతుందని బుధవారం అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఇరు పక్షాల మధ్య 14 అంశాలతో కూడిన ఒక అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) ముసాయిదా రూపొందినట్టు తెలిసింది. ఇది ఇంకా తుదిరూపం దాల్చకపోయినప్పటికీ, గతంలో లేనంతగా ఈసారి చర్చలు ముందుకుసాగాయి. ఇరాన్ నాయకత్వం 48 గంటల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించవచ్చునని, అన్ని దేశాలకు హొర్ముజ్ జలసంధిని ఇరాన్ తెరువనున్నదని ‘ఆక్సియోస్’ న్యూస్ తెలిపింది. అంతేగాక ముసాయిదా ఒప్పందంలో భాగంగా.. అణు కార్యక్రమాన్ని నిలిపివేసేందుకు ఇరాన్ అంగీకరించినట్టు సమాచారం. ఇదంతా ఒక కొలిక్కి వచ్చాక.. యుద్ధాన్ని ముగించడానికి ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఇరాన్‌పై ఆంక్షల తొలగింపు, అణు కార్యక్రమం నిలిపివేత, హొర్ముజ్ జలసంధి, లోతైన చర్చలకు 30 రోజుల గడువు.. ప్రధాన అంశాలుగా ప్రతిపాదిత ఒప్పందం రూపొందినట్టు తెలిసింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. ఇందుకు ప్రతిగా అమెరికా క్రమంగా తన ఆంక్షలను సడలించి, ఇరాన్‌కు చెందిన బిలియన్ డాలర్ల ఆస్తులను విడుదల చేస్తుంది.
‘ప్రాజెక్ట్ ఫ్రీడం’ను నిలిపివేసిన ట్రంప్
ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ‘హొర్ముజ్ జలసంధి’ దిగ్బంధం చేస్తూ అమెరికా చేపట్టిన ‘ప్రాజెక్ట్ ఫ్రీడం’ను నిలిపివేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. యుద్ధాన్ని ముగించే దిశగా ఒప్పందంపై ఇరాన్‌తో జరుగుతున్న చర్చల్లో మంచి పురోగతి సాధించినట్టు తాజాగా ఆయన వెల్లడించారు. ఇరాన్ ప్రతినిధులతో పూర్తి, తుది ఒప్పందం దిశగా చర్చల్లో గొప్ప పురోగతి సాధించామని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ మరుసటి రోజే (బుధవారం నుంచి) అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, హొర్ముజ్ జలసంధి తెరిచేందుకు ఇరాన్ నిరాకరిస్తే.. గతంలో కంటే భీకరమైన దాడులు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. అన్ని దేశాలకు హొర్ముజ్‌ను ఇరాన్ తెరువాల్సిందేనని, ఒప్పందంలో నిబంధనలకు ఇరాన్ ఒప్పుకోకపోతే బాంబు దాడులు మొదలవుతాయని ట్రంప్ చెప్పారు. యుద్ధం ముగింపుపై అమెరికా-ఇరాన్ మధ్య ఒక ‘పరస్పర అవగాహన ఒప్పందం’ కుదిరే అవకాశముందని అంతర్జాతీయ మీడియా పేర్కొన్నది. ఈ క్రమంలో ట్రంప్ నుంచి పై ప్రకటన వెలువడింది. ఫిబ్రవరి 28న అమెరికా ప్రారంభించిన యుద్ధం (ఆపరేషన్ ఎపిక్ఫ్యూరీ) లక్ష్యాలు నెరవేరటంతో.. అది ముగిసిందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మంగళవారం ప్రకటించారు. ఇది వెలువడిన కొద్ది గంటల్లోనే ప్రాజెక్ట్ ఫ్రీడంను అమెరికా నిలిపివేయటం గమనార్హం.