వాషింగ్టన్, సెప్టెంబర్ 3: ఒకప్పుడు విపరీతమైన సుంకాలతో తమను ఎడాపెడా బాదేసిన భారత్ తాము విధించిన 50 శాతం సుంకాలతో దారిలోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తాము భారత్‌పై 50 శాతం సుంకాలు విధించడాన్ని ఆయన సమర్థించుకున్నారు. ‘భారత దేశం సుంకాలతో అమెరికాను చంపుతోంది, కానీ మా ప్రతీకార సుంకాలతో ఆ దేశం ఇప్పుడు ‘అమెరికాకు సుంకాలు లేవు’ అని ఆఫర్ ఇచ్చిందని ట్రంప్ తెలిపారు.
వాణిజ్యం, సుంకాలు, పరిపాలనా విధానాలపై వాషింగ్టన్కు న్యూఢిల్లీతో ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో ఆయన మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కారు. ‘సుంకాలతో భారత్ మమ్మల్ని చంపుతోంది. చైనా చంపుతోంది. బ్రెజిల్ కూడా చంపుతోంది’ అని ఆయన మంగళవారం స్కాట్ జెన్నింగ్స్ రేడియో షోలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు. ‘సుంకాల గురించి ప్రపంచంలోని ఏ ఇతర మనిషి కన్నా నేను బాగా అర్థం చేసుకున్నాను. నేను ఇప్పుడు విధించిన టారిఫ్‌లతో వారు దారికొచ్చి తమ సుంకాలను విరమించుకున్నారు.
ఇక ముందు భారత్‌లో మీ వస్తువులపై సుంకాలు విధించమని వారు ఇప్పుడు హామీ ఇస్తున్నారు’ అని ట్రంప్ ఆరోపించారు. ‘నేను వారిపై సుంకాలు విధించకుంటే వారు ఎన్నడూ ఈ ప్రతిపాదన చేసి ఉండేవారు కాదు. కాబట్టి మనం సుంకాలను విధిస్తూ ఉండాలి. అప్పుడే మన దేశం బలంగా ఉంటుంది’ అని ఆయన అన్నారు. భారత్‌పై విధించిన కొన్ని సుంకాలను ఎత్తివేసే ఆలోచన చేస్తున్నారా? అన్న ప్రశ్నకు లేదని సమాధానం చెప్పారు.