న్యూఢిల్లీ, అక్టోబర్ 5: తొలి దశలో భాగంగా గాజాలోని బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని హమాస్‌కు కూడా పంపించినట్లు ఆయన తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా శనివారం వెల్లడించారు. హమాస్ నుంచి ఆమోదం లభించిన వెంటనే గాజాలో కాల్పుల విరమణ అమలులోకి వస్తుందని, ఇజ్రాయెలీ బందీలు, పాలస్తీనా బందీల మార్పిడి ప్రారంభమవుతుందని ట్రంప్ తెలిపారు. తొలి దశ ఉపసంహరణకు పరిస్థితులను సానుకూలం చేస్తామని, దీంతో 3,000 సంవత్సరాల పాలస్తీనా సంక్షోభానికి ముగింపు లభించగలదని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్ గొప్ప విజయానికి చేరువలో ఉందంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శనివారం ప్రకటించిన కొన్ని గంటల్లోనే ట్రంప్ నుంచి ఈ ప్రకటన వెలువడడం విశేషం. గాజాలో శాంతి ప్రణాళిక అమలు ఇంకా ఖరారు కాలేదని, రానున్న రోజుల్లో ఇది సాధ్యపడలదని ఆశిస్తున్నామని నెతన్యాహు తెలిపారు. త్వరలోనే సజీవంగా ఉన్న, మరణించిన బందీల తిరిగిరాక ఒకే దశలో జరుగుతుందని ఆయన చెప్పారు. గాజా స్ట్రిప్‌లోనే ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఉండి కీలక ప్రాంతాలను నియంత్రిస్తాయని నెతన్యాహు చెప్పారు.
ఇజ్రాయెల్ ప్రతిపాదించిన ప్రణాళికను ఒప్పుకునేలా హమాస్‌పై తీవ్ర సైనిక, దౌత్య ఒత్తిడి పెట్టినట్లు ఆయన వెల్లడించారు. బలగాల ఉపసంహరణ తొలి దశలో ఇజ్రాయెలీ బందీలు అందరినీ హమాస్ విడుదల చేస్తుందని, ఐడీఎఫ్ ఉపసంహరణ జరిగినప్పటికీ గాజా స్ట్రిప్‌లోని కీలక వ్యూహాత్మక ప్రాంతాలపై ఐడీఎఫ్ నియంత్రణ కొనసాగుతుందని నెతన్యాహు చెప్పారు.