వాషింగ్టన్, అక్టోబర్ 16 : రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఉక్రెయిన్లో యుద్ధాన్ని ఆపేందుకు రష్యాపై ఆర్థికపరమైన ఒత్తిళ్లు పెంచాలని భావిస్తున్న అమెరికా రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపివేయాలని కోరుతోంది. అతి త్వరలోనే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని ప్రధాని మోదీ నుంచి తనకు హామీ వచ్చినట్లు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ వెల్లడించారు.
ట్రంప్ చేసిన ప్రకటనను భారత ప్రభుత్వం గురువారం ఖండించింది. ఇద్దరు నాయకుల మధ్య బుధవారం ఎటువంటి ఫోన్ సంభాషణ జరగలేదని స్పష్టం చేసింది. అంతకుముందు భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. చమురు, సహజవాయువును భారీ స్థాయిలో దిగుమతి చేసుకునే భారత్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంధన పరిస్థితి సంక్లిష్టంగా ఉన్నందున తమ దేశ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించుకునే విధంగా తమ నిర్ణయాలు ఉంటాయని ఆయన చెప్పారు.
రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయడానికి భారత ప్రధాని మోదీ అంగీకరించారని ట్రంప్ చేసిన ప్రకటనపై రష్యా స్పందించింది. తన జాతీయ ప్రయోజనాల ఆధారంగానే చమురు దిగుమతులపై భారత్ నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నది. భారత్-అమెరికా సంబంధాలలో రష్యా జోక్యం ఉండబోదని స్పష్టంచేసింది. భారతీయ ఆర్థిక వ్యవస్థకు, భారత ప్రజల సంక్షేమానికి తమ చమురు దిగుమతులు చాలా ప్రయోజనకరమని పేర్కొన్నది.