Trump and Putin : ఇరాన్‌పై అమెరికా భూతల దాడి చేయొద్దని, అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ఇరువురి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ సందర్భంగా పుతిన్ ఈ హెచ్చరిక చేసినట్లు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దాదాపు 90 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు.
దీనికి సంబంధించిన విషయాల్ని రష్యాకు చెందిన విదేశీ సలహాదారు యురి ఉషకోవ్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ట్రంప్, పుతిన్.. ఇరాన్ యుద్ధం, ఉక్రెయిన్ యుద్ధాలపై చర్చించారు. ఇరాన్‌పై అమెరికా భూతల దాడి చేయడం ప్రమాదకరమని, అలా జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్‌ను హెచ్చరించారు. మరోవైపు ఉక్రెయిన్‌పై కాల్పుల విరమణ అంశంలో ట్రంప్ సూచనను పుతిన్ స్వాగతించారు. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ ట్రంప్‌తో చెప్పారు.
ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు అవసరమైతే మధ్యవర్తిత్వంలో సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ట్రంప్‌తో పుతిన్ తెలిపారు. ఈ అంశంపై ట్రంప్ కూడా స్పందించారు. పుతిన్‌తో చర్చలు బాగా సాగాయని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించడంలో సాయం అందించేందుకు రష్యా సిద్ధంగా ఉందని ట్రంప్ అన్నారు. త్వరలోనే ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు రష్యా సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందని ట్రంప్ అన్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.