India-Pakistan | ఐక్యరాజ్యసమితి (ఐరాస) వేదికగా దాయాది పాకిస్థాన్‌కు భారత్ మరోసారి గట్టిగా బదులిచ్చింది. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (United Nations General Assembly)లో పాకిస్థాన్ (Pakistan) ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) ప్రసంగిస్తూ.. ఈ ఏడాది ప్రారంభంలో భారత్ నుంచి ప్రేరేపిత దాడిని ఎదుర్కొన్నామంటూ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ గురించి, భారత్ సింధు జలాల ఒప్పందం నిలిపివేయడంపై ప్రస్తావించారు. తమ సైన్యం అద్భుతమైన నైపుణ్యం, ధైర్యం, చతురతతో భారత్ దాడిని తిప్పికొట్టాయంటూ చెప్పుకొచ్చారు. భారత్ సింధు జలాల ఒప్పందం నిలిపివేయడాన్ని యుద్ధ చర్యగా అభివర్ణించారు. ఆయన వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్.. అంతర్జాతీయ వేదికలపై అబద్ధాలు చెబుతోందని పేర్కొంది.
పాక్ ప్రధాని వ్యాఖ్యలపై భారత (India) దౌత్యవేత్త పేటల్ గహ్లోత్ (Petal Gahlot) స్పందిస్తూ.. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాక్.. అంతర్జాతీయ వేదికలపై అబద్ధాలు చెప్పడానికి సిగ్గుపడదు. అయితే, ఏ స్థాయిలోనూ వాస్తవాలను వారి అబద్ధాలు దాచలేవు. ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో మునిగిపోయింది. ఉగ్రవాదంపై యుద్ధంలో భాగస్వామిగా నటిస్తూనే.. ఒక దశాబ్దం పాటూ ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం కల్పించింది’ అంటూ వ్యాఖ్యానించారు.
‘పాక్ ప్రాయోజిత ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ జమ్ము కశ్మీర్లో ఊచకోతకు పాల్పడింది. ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. మే 10న యుద్ధం ముగించాలంటూ పాక్ సైన్యమే భారత్‌ను వేడుకుంది. కానీ వాళ్లు (పాక్‌ను ఉద్దేశిస్తూ) మేము యుద్ధంలో గెలిచాము అంటూ, శాంతిని నెలకొల్పామంటూ చెప్పుకుంటున్నారు. ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైన రన్వేలు, హ్యాంగర్లను పాక్ విజయంగా భావిస్తే.. దాయాది దేశం దాన్ని ఆస్వాదించొచ్చు. భారత్‌లోని అమాయక పౌరులపై జరిగిన దాడికి పాక్ బాధ్యత వహించాలి. పాక్ నిజంగా శాంతిని కోరుకుంటే.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపి భారత్ కోరుకున్న ఉగ్రవాదులను అప్పగించాలి. అణు బెదిరింపులతో ఉగ్రవాదాన్ని ఎగదోయడాన్ని భారత్ ఎప్పటికీ సహించదు. అలాంటి వాటికి తలొగ్గదు’ అని పేటల్ గహ్లోత్ స్పష్టం చేశారు.
అంతకుముందు ఐరాసలో పాక్ ప్రధాని మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేందుకు ట్రంప్ సాహసోపేత చొరవ ప్రశంసనీయమన్నారు. ట్రంప్ చర్యలు, నిర్ణయాలతో దక్షిణాసియాలో పెద్ద ముప్పు తప్పిందని వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా పలు వివాదాల ముగింపునకు ట్రంప్ నిజాయితీగా కృషి చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఆయన ప్రపంచంలో శాంతి ఉండాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఆయన జోక్యం చేసుకోకపోయి ఉంటే భారత్-పాక్‌ల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగేదంటూ చెప్పుకొచ్చారు. దక్షిణాసియాలో శాంతి స్థాపనకు ట్రంప్ చేసిన విశేష కృషికి గాను పాక్.. ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినట్లు పాక్ ప్రధాని చెప్పారు.
అనంతరం సింధు జలాలు, కశ్మీర్ అంశంపై షరీఫ్ మాట్లాడుతూ.. సింధు నదీ జలాల ఒప్పందాన్ని (Indus Water Treaty) భారత్ ఏకపక్షంగా రద్దు చేసిందని వ్యాఖ్యానించారు. ‘సింధు నది జలాల విషయంలో భారత్ తీసుకున్న చర్యలు అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘిస్తున్నాయి. ఇది యుద్ధ చర్యతో సమానం. కశ్మీర్ సహా అన్ని వివాదాస్పద అంశాలపై భారత్‌తో సమగ్ర చర్చలకు సిద్ధంగా ఉన్నాం. ఉగ్రవాదాన్ని పాక్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది’ అని తెలిపారు. కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్‌తో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read..
Epstein Files | ఎప్స్టీన్ ఫైళ్లలో ఎలాన్ మస్క్ పేరు.. ఖండించిన ప్రపంచ కుబేరుడు
ఇరాన్, వెనిజువెలా నుంచి దిగుమతులకు అనుమతించండి.. చమురుపై అమెరికాను కోరిన భారత్