Iran | ఇరాన్ (Iran) అట్టుడుకుతున్నది. ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో నిరసనలపై ఆ దేశం ఉక్కుపాదం మోపుతోంది. సైన్యం కాల్పుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. ఈ ఆందోళనల్లో మృతుల సంఖ్య 500 దాటింది. దాదాపు 530 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికాకు చెందిన మానవ హక్కుల సంఘం తెలిపింది. దాదాపు 490 మంది నిరసనకారులు కాగా, 48 మంది భద్రతా సిబ్బంది మరణించినట్లు సమాచారం. రెండు వారాల్లో దాదాపు 10,600 మందికి పైగా అరెస్ట్ అయినట్లు పేర్కొంది. ఇరాన్ దవాఖానలు శవాల కుప్పలతో నిండిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. టెహ్రాన్ సహా దేశవ్యాప్తంగా దవాఖానల్లో శవాలు ఒకదానిపై మరొకటి పడి ఉన్నాయని, రోగులతో వార్డులు కిటకిటలాడుతున్నాయని మెడికల్ వర్కర్స్ తెలిపారు.
మరోవైపు ఇరాన్లో తాజా పరిస్థితులపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఖమేనీ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌పై సైనిక చర్య అవకాశాల్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తోంది. ఆందోళనకారులకు ఏమైనా జరిగితే తాము రంగంలోకి దిగుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే హెచ్చరిస్తున్నారు. దీంతో ఇరాన్ సైతం అమెరికాకు కీలక హెచ్చరికలు చేసింది. సైనిక చైర్య బెదిరింపులు చేస్తే అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని టెహ్రాన్ బెదిరింపులకు పాల్పడింది.
Also Read..
US Strikes | ఇరాన్‌పై అమెరికా దాడులు.. ఆందోళనకారులకు సాయం చేస్తామన్న ట్రంప్