మెల్బోర్న్, మే 27: పపువా న్యూ గినియాలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో సజీవ సమాధి అయిన వారి సంఖ్య భారీగా పెరుగుతున్నది. శిథిలాల కింద 2 వేల మంది ఉన్నట్టు ఆ దేశం ఐక్యరాజ్యసమితికి (ఐరాస) తెలిపింది. ఆ దేశానికి చెందిన జాతీయ విపత్తు కేంద్రం ఐరాసకు లేఖ రాసింది. కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 2 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నది. అంతర్జాతీయ సాయం కావాలని ఆ దేశం ఐరాసను వేడుకుంది. ఐరాస తొలుత మృతుల సంఖ్యను 670గా అంచనా వేయగా, దీనికి మూడు రెట్లు మరణాలున్నాయని పపువా న్యూ గినియా ప్రభుత్వం చెబుతున్నది. ఆస్ట్రేలియా ప్రభుత్వం సోమవారం విమానం, ఇతర పరికరాలను సాయంగా పంపింది. శుక్రవారం రాత్రి పపువా న్యూ గినియాలోని పర్వతప్రాంతాల్లో భారీ వర్షాలు కురియటంతో అక్కడి వందలాది గ్రామాలపైకి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వేలాది ఇండ్లు నేలమట్టమయ్యాయి. ఒకప్పుడు ఆస్ట్రేలియాకు వలస దేశంగా ఉన్న పపువా న్యూ గినియా 1975లో స్వాతంత్య్రం పొందింది.