సోమవారం 18 జనవరి 2021
International - Dec 26, 2020 , 03:03:14

కళతప్పిన క్రిస్మస్‌

కళతప్పిన క్రిస్మస్‌

  • ప్రపంచవ్యాప్తంగా కనిపించని పండుగ శోభ
  • కరోనా ఆంక్షలతో  బోసిపోయిన చర్చిలు 

రోమ్‌, డిసెంబర్‌ 25: కరోనా ఆంక్షల నేపథ్యంలో ఈసారి ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు కళ తప్పాయి. చర్చిలు బోసిపోయాయి. పలు చోట్ల సామూహిక ప్రార్థనలు రద్దు కాగా, కొన్ని చోట్ల పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించారు. క్రీస్తు జన్మస్థలమైన ఇజ్రాయెల్‌లోని బెత్లెహాంలోనూ  పండుగ శోభ కనిపించలేదు. ఏటా క్రిస్మస్‌ నాడు బెత్లెహాం జనంతో కళకళలాడేది. వేలాది మంది పర్యాటకులు తరలివచ్చేవారు. అయితే విమాన సర్వీసులు నిలిచిపోవటంతో పర్యాటకులు రాలేకపోయారు. మరోవైపు, ఆస్ట్రేలియాలో భౌతిక దూరం పాటిస్తూ ప్రార్థనలు నిర్వహించేందుకు ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించారు. ఫిలిప్పీన్స్‌లో సామూహిక ప్రార్థనలు రద్దుచేశారు. గ్రీస్‌లో సంప్రదాయంగా ఏటా క్రిస్మస్‌ రోజున పిల్లలు గీతాలు ఆలపిస్తూ ఇంటింటికి వెళ్లి బహుమతులు స్వీకరించే కార్యక్రమాన్ని రద్దుచేశారు. ఇటలీలో కర్ఫ్యూ నేపథ్యంలో ఈసారి చర్చి బెల్స్‌ సాధారణం కంటే ముందే మోగాయి. వాటికన్‌లోని ప్రఖ్యాత సెయింట్‌ పీటర్స్‌ బసిలికా చర్చిలో పరిమిత సంఖ్యలో హాజరైన భక్తజనం మధ్య పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రార్థనలు నిర్వహించారు.  కొలంబియాలో వేలాదిమంది వెనెజులా వలసదారులు స్వస్థలానికి వెళ్లలేకపోయారు. ఇండియాలో కూడా క్రిస్మస్‌ వేడుకలు సాదాసీదాగా జరిగాయి. క్రైస్తవ జనాభా ఎక్కువగా ఉన్న గోవాలో కూడా పెద్దగా సందడి కనిపించలేదు. చర్చిల్లో కేవలం 200 మంది మాత్రమే ప్రార్థనలు నిర్వహించడానికి అనుమతులిచ్చారు.