China vs USA : జెనీవా వాణిజ్య చర్చల్లో కుదిరిన ఒప్పందాన్ని బీజింగ్ (Beijing) ఉల్లంఘించిందంటూ అమెరికా అధ్యక్షుడు (USA President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలను చైనా (China) తోసిపుచ్చింది. అవి పూర్తిగా నిరాధార ఆరోపణలని పేర్కొంది. ఈ మేరకు ట్రంప్ వ్యాఖ్యలపై చైనా వాణిజ్య శాఖ స్పందించింది.
జెనీవాలో జరిగిన ఒప్పందాన్ని తాము పూర్తిస్థాయిలో అమలుచేసినట్లు చైనా పేర్కొంది. అమెరికా మాత్రం బీజింగ్‌పై వివక్షపూరిత చర్యలు తీసుకున్నట్లు ఆరోపించింది. వీటిల్లో కృత్రిమ మేధకు సంబంధించిన చిప్స్‌పై నియంత్రణ, చిప్ డిజైన్ సాఫ్ట్వేర్లు తమకు విక్రయించకుండా సృష్టించిన అడ్డంకులు, తమ దేశ విద్యార్థుల వీసాల రద్దు లాంటివి ఉన్నాయని వెల్లడించింది.
‘అమెరికా ఉద్దేశపూర్వకంగానే ద్వైపాక్షిక వాణిజ్యంలో మళ్లీమళ్లీ ఆర్థిక, వాణిజ్య ఘర్షణలు, అస్థిరతను రేపుతోంది’ అని చైనా వాణిజ్య శాఖ మండిపడింది. అయితే అందుకు ప్రతిగా ఏం చర్యలు తీసుకుంటుందో మాత్రం వెల్లడించలేదు. కాగా మే నెల మధ్యలో బీజింగ్-వాషింగ్టన్ల మధ్య జెనీవా వేదికగా ఓ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 90 రోజులపాటు మూడంకెల టారిఫ్‌ల అమలును నిలిపివేయాల్సి ఉంది.
చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాలు, సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్ పరిశ్రమకు అవసరమైన ముడిసరుకును నిరాటంకంగా సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ట్రంప్ మాట్లాడుతూ.. చైనా ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించిందని వ్యాఖ్యానించారు. అదేరోజు ఆయన స్టీల్, అల్యూమినియం దిగుమతిపై టారిఫ్‌ను రెట్టింపు చేసి 50 శాతానికి చేర్చారు.