బీజింగ్, ఆగస్టు 14: సమృద్ధిగా వానలు పడాలంటే చెట్లను పెంచుకోవాలి. కాలుష్యాన్ని తగ్గించుకోవాలి. ప్రకృతి విధ్వంసాన్ని ఆపాలి. అప్పుడే వరుణుడు కరుణిస్తాడు. మేఘాలను పంపిస్తాడు. వర్షాలను కురిపిస్తాడు. కానీ ఇవన్నీ పొరుగుదేశం చైనాకు కాలం వృథా వ్యవహారం. అందుకే వానదేవుడు పంపించే మేఘాలను తమ భూభాగంలోనే కరిగించుకోవాలని, ప్రకృతికి విరుద్ధంగా వానలు కురిపించుకోవాలని ప్రణాళికలు రచించింది. తద్వారా భారతదేశంలో పడాల్సిన వాననీటిని ఆకాశంలో నుంచే దొంగిలించాలని పథకం పన్నింది.
క్లౌడ్ సీడింగ్(మేఘమథనం) ద్వారా దేశంలోని 55 లక్షల కిలోమీటర్ల మేర అవసరమైనప్పుడల్లా వానలు కురిపించుకోవడానికి చైనా తియాన్హే ప్రాజెక్టును ప్రకటించింది. 2025కల్లా ఈ ప్రాజెక్టును అమలు జరిపేందుకు అవసరమైన వనరులు సమకూర్చుకోవాలని నిర్ణయించింది. తియాన్హే ప్రాజెక్టు కోసం చైనా ఎంచుకొన్న భూభాగం భారతదేశ వైశాల్యం కంటే 1.5 రెట్లు ఎక్కువ. చైనా మొత్తం భూభాగంలో సగం కంటే ఎక్కువ. తియాన్హే అంటే ఆకాశ నది అని అర్థం. ఈ ప్రాజెక్టును 2016లో షింగువా వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. మొదట 16 లక్షల కిలోమీటర్ల లోపే వర్షాలు కురిపించాలని నిర్ణయించారు. కానీ తర్వాత పరిధిని పెంచారు. చైనాలో ఏడాది పొడుగునా కురిసే వర్షంతో పోలిస్తే ఈ ప్రాజెక్టుతో సగటున 7% అదనంగా వాన కొట్టేలా చేయాలన్నది చైనా లక్ష్యం. 2020 చివరికే మేఘమథనం కోసం చైనా ప్రత్యేకంగా 16 రాకెట్లను ప్రారంభించింది.
భవిష్యత్తులో పర్యావరణ యుద్ధాలు
చైనా తియాన్హే ప్రాజెక్టుపై వాతావరణ నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. దీని ప్రభావం చైనా సరిహద్దుల లోపలే కాకుండా ఆవల కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. భారత్‌కు నష్టం కలుగజేస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై భారత్ అంతర్జాతీయ సమాజం ముందు అభ్యంతరాలు లేవనెత్తాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. భవిష్యత్తులో దేశాల మధ్య పర్యావరణ యుద్ధాలు సంభవించే ప్రమాదం ఉందన్నారు.
రాజకీయ సమావేశాల కోసమూ..
బీజింగ్‌లో 2008లో ఒలింపిక్స్ ప్రారంభోత్సవం సమయంలో వాన పడకుండా చైనా క్లౌడ్ సీడింగ్ ద్వారా మేఘాలను దారి మళ్లించింది. ఇప్పుడు కూడా ఏదైనా రాజకీయ సమావేశాలు ఉన్నప్పుడు వర్షం వల్ల అడ్డంకులు ఏర్పడకుండా ఈ విధానాన్నే అవలంబిస్తున్నది. అమెరికా కూడా మేఘమథనం ప్రాజెక్టుపై పెట్టుబడులు పెడుతున్నది.
ఒప్పందం ఉల్లంఘన
వియత్నాం యుద్ధ సమయంలో క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని వినియోగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మిలిటరీ లేదా వేరే ఏ ఇతర అనిశ్చితి ఉన్న సమయంలోనైనా ఇలాంటి చర్యలు చేపట్టవద్దని 1978లో ఓ ఒప్పందం జరిగింది. దీనిని 2005లో చైనా కూడా ఆమోదించింది. కానీ అలవాటు ప్రకారం ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నది.