ఢాకా : భారత్‌కు చెందిన అదానీ గ్రూపుతో గత హసీనా ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందంలో అవినీతి లేదా అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో రుజువైతే ఒప్పందాన్ని రద్దు చేసేందుకు వెనుకాడబోమని బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం హెచ్చరించింది. విద్యుత్తు రంగంలో పెద్దఎత్తున అవినీతి, అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపత్యంలో హసీనా హయాంలో సంతకాలు చేసిన ప్రధాన కాంట్రాక్టులపై ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం దర్యాప్తును చేపట్టింది.
తాత్కాలిక ప్రభుత్వంలో ఇంధన వ్యవహారాల సలహాదారు ముహమ్మద్ ఫౌజుల్ కబీర్ ఖాన్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఎటువంటి అవినీతి జరగలేదని గత పాలకులు చెబుతారని, ఒకవేళ అవినీతికి సంబంధించిన ఆధారాలు లభించిన పక్షంలో ఆ కాంట్రాక్టులను రద్దు చేయడానికి కూడా వెనుకాడబోమని చెప్పారు. హసీనా ప్రభుత్వంలో 2017లో అదానీ గ్రూపుతో కుదుర్చుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందంతోసహా అన్ని ప్రధాన విద్యుత్తు ఒప్పందాలను దర్యాప్తు చేసేందుకు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల జాతీయ సమీక్షా కమిటీ తన మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన నేపథ్యంలో కబీర్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లా ప్రకటనపై అదానీ సంస్థ ఇంకా స్పందించలేదు.