Muhammad Yunus | పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. ముహమ్మద్ యూనస్ (Muhammad Yunus) సారథ్యంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై స్థానికంగా ఒత్తిడి పెంచింది. డిసెంబర్ కల్లా దేశంలో ఎన్నికలు (Bangladesh elections) నిర్వహించాలని పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేలాది మంది యువజనులు, బీఎన్పీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా నిరసన చేపడుతున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ ఎన్నికలపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ స్పందించారు.
ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది (2026) జూన్ మధ్య ఎప్పుడైనా ఎన్నికలు జరగొచ్చని చెప్పారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న యూనస్.. టోక్యోలో నిర్వహించిన ఓ పబ్లిక్ ర్యాలీలో ఈ మేరకు ప్రకటన చేశారు. కొన్ని సంస్కరణలు చేపడుతున్నట్లు చెప్పారు. సంస్కరణల అమలు తీరును బట్టి ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది జూన్ మధ్యలో ఎన్నికలను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.
గతేడాది బంగ్లాలో రాజకీయ అస్థిరత నెలకొన్న విషయం తెలిసిందే. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రజా ఉద్యమానికి జడసి ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) తన పదవికి రాజీనామా చేసి దేశం వీడారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వయిజర్‌గా నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టారు. గతేడాది ఆగస్టు 8న ఆయన తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఆ దేశంలో మళ్లీ రాజకీయ సంక్షోభం రాజుకుంటున్నది. తన పదవికి రాజీనామా చేస్తానని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద్ యూనస్ హెచ్చరించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆర్మీ చీఫ్‌కి వ్యతిరేకంగా మరో ఉద్యమాన్ని నిర్వహించాలన్న ఆలోచనతోనే యూనస్ రాజీనామా బెదిరింపులు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రస్తుత రాజకీయ వాతావరణం, నిరసనల మధ్య తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్న కారణంగానే రాజీనామా చేయాలని యూనస్ యోచిస్తున్నట్లు విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న నేషనల్ సిటిజన్ పార్టీ(ఎన్సీపీ) కన్వీనర్, విద్యార్థి ఉద్యమ నాయకులలో ఒకరైన నహీద్ ఇస్లామ్ బీబీసీకి తెలిపారు.
డిసెంబర్ కల్లా దేశంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది యువజనులు, బీఎన్పీ కార్యకర్తలు బుధవారం ఢాకాలో ప్రదర్శన నిర్వహించారు. డిసెంబర్ కల్లా జా తీయ ఎన్నికలు జరగాలని, వెంటనే ఇందుకు సన్నాహాలు ప్రారంభించాలని బీఎన్పీ తాత్కాలిక చైర్మన్ తారీఖ్ రెహ్మాన్ డిమాండు చేశారు. లండన్ నుంచి వర్చువల్‌గా ఆయన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. యూనస్ ఆశీస్సులతో కొత్తగా విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పడిన నేషనల్ సిటిజెన్ పార్టీకి వ్యతిరేకంగా తమ బలాన్ని ప్రదర్శిస్తూ వేలాది మంది విద్యార్థులు నేటి ర్యాలీలో పాల్గొన్నారు.
Also Read..
Bangladesh | బంగ్లాదేశ్‌లో మళ్లీ సంక్షోభం.. ఆర్మీ చీఫ్‌కి వ్యతిరేకంగా అల్లర్లకు కుట్రలు!
Muhammad Yunus | ఎన్నికలపై ఒత్తిడి చేస్తే మరో ప్రజా ఉద్యమం తప్పదు.. హెచ్చరించిన మొహమ్మద్ యూనస్
Sheikh Hasina | నన్ను కాల్చి చంపి.. గణబంధన్‌లో పాతిపెట్టండి : రాజీనామాకు ముందు షేక్ హసీనా