Muhammad Yunus | ఢాకా: అసమంజమైన డిమాండ్ల ద్వారా తమపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నిస్తే ప్రజా మద్దతుతో కార్యాచరణ చేపట్టవలసి వస్తుందని బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వ ముఖ్య సలహాదారు మొహమ్మద్ యూనస్, ఆయన సహాయకులు శనివారం హెచ్చరించారు. దేశంలో డిసెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆర్మీ చీఫ్ జనరల్ వకర్ ఉజ్ జమాన్, ఖలీదా జియా సారథ్యంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఈ హెచ్చరిక వెలువడింది.
గడచిన తొమ్మిది నెలలుగా బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు, నిరసనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ స్వయం ప్రతిపత్తికి, సంస్కరణల యత్నాలకు, న్యాయ ప్రక్రియకు, స్వేచ్ఛాయుత ఎన్నికలకు, ప్రభుత్వ విధి నిర్వహణకు ఆటంకం కలిగించే విధంగా ఎటువంటి చర్యలు జరిగినా ప్రజలతో సంప్రదించి అవసరమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుందని యూనస్ కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో హెచ్చరించింది. యూనస్ తన పదవికి రాజీనామా చేయరని కూడా తెలిపింది.