Bangladesh | ఢాకా, మే 23: బంగ్లాదేశ్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం రాజుకుంటున్నది. తన పదవికి రాజీనామా చేస్తానని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద్ యూనస్ హెచ్చరించినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో దీనికి నిరసనగా శనివారం (మే 24) రాజధాని ఢాకాలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన మద్దతుదారులు ప్రకటించారు. యూనస్‌ను ఐదేళ్లపాటు పదవిలో ఉంచాలి, ముందు సంస్కరణలు-తర్వాతే ఎన్నికలు అంటూ నిరసనకారులు తమ పోస్టర్లలో డిమాండు చేశారు.
ఈ ఏడాది డిసెంబర్‌లోగా దేశంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకర్-ఉజ్ జమాన్ బుధవారం పిలుపునిస్తూ దేశ భవిష్యత్తును నిర్ణయించే అధికారం ప్రజా ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని పునరుద్ఘాటించిన నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తానని యూనస్ హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బంగ్లాదేశ్ అనధికార ప్రధానమంత్రిగా కొనసాగుతున్న యూనస్ పదవీకాలం ముగిసిపోతుంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో శనివారం యూనస్ మద్దతుదారులు ఆర్మీ కంటోన్మెంట్ వరకు నిర్వహించే ర్యాలీ ఎటువంటి హింసాత్మక ఘటనలకు దారితీస్తుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నది.
విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారిన దరిమిలా సైన్యం నుంచి వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గి రాజీనామా చేసిన ప్రధాని షేక్ హసీనా గత ఏడాది ఆగస్టు 5న దేశం విడిచి భారత్‌కి పారిపోయారు. ఆర్మీ చీఫ్‌కి వ్యతిరేకంగా మరో ఉద్యమాన్ని నిర్వహించాలన్న ఆలోచనతోనే యూనస్ రాజీనామా బెదిరింపులు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రస్తుత రాజకీయ వాతావరణం, నిరసనల మధ్య తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్న కారణంగానే రాజీనామా చేయాలని యూనస్ యోచిస్తున్నట్లు విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న నేషనల్ సిటిజన్ పార్టీ(ఎన్సీపీ) కన్వీనర్, విద్యార్థి ఉద్యమ నాయకులలో ఒకరైన నహీద్ ఇస్లామ్ బీబీసీకి తెలిపారు.
‘ఎన్సీపీకి సారథ్యం వహించేందుకు నహీద్ ఫిబ్రవరిలో యూనస్ క్యాబినెట్‌కి రాజీనామా చేశారు. గురువారం సాయంత్రం ప్రభుత్వ అతిథి గృహం జమునలో యూనస్‌తో సమావేశమైన నహీద్ పదవిలో కొనసాగవలసిందిగా అభ్యర్థించారని సమావేశానికి హాజరైన మరో ఎన్సీపీ నాయకుడు అరీఫుల్ ఇస్లాం అదీబ్ తెలిపారు. తాను పదవిలో కొనసాగలేనని, మరో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని విద్యార్థి నాయకులే ఏర్పాటు చేసుకోవాలని యూనస్ కోరినట్లు బంగ్లాదేశ్ దినపత్రిక ప్రొథోమ్ తెలిపింది.
విద్యార్థులను, ఇస్లామిస్టులను
విద్యార్థులు, ఇస్లామిస్టు మూకలను తన సొంత సైన్యంగా వాడుకుంటున్న యూనస్ ఎన్నికలు నిర్వహించకుండా అధికారంలో కొనసాగాలని ప్రయత్నిస్తున్నట్లు జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. 2026 జూన్‌లోగా ఎన్నికలు జరుగుతాయని యూనస్ చెబుతున్నప్పటికీ బీఎన్పీతోసహా వివిధ రాజకీయ పార్టీలు సత్వర ఎన్నికలను కోరుతున్నాయి. అయితే ఆర్మీ చీఫ్ జమాన్ మాత్రం యూనస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వం డిసెంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని బుధవారం హెచ్చరికలు జారీచేశారు. దీంతో ఆయనను పదవీచ్యుతుడిని చేసేందుకు విద్యార్థులు, ఇస్లామిస్టు మూకలను యూనస్ వాడుకునే అవకాశం ఉందన్న అనుమానాలు కూడా బలంగా వ్యాపిస్తున్నాయి.
కోల్‌కతాకు చెందిన ప్రభుత్వ రంగ నౌకా నిర్మాణ సంస్థ గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్‌తో రూ. 180.25 కోట్ల రక్షణ ఒప్పందాన్ని బంగ్లాదేశ్ శుక్రవారం రద్దు చేసుకుంది. భారత్‌తో దౌత్య సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. తమ రక్షణ ఆర్డర్‌ను రద్దు చేసుకున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజీకి నోటిఫై చేసింది. ఇతర దేశాలకు జరిగే బంగ్లాదేశీ కార్గో ఎగుమతులకు భారత్‌లో ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాలు రద్దు చేయాలని భారత్ ఇటీవల తీసుకున్న నిర్ణయానికి ప్రతీకారంగా బంగ్లాదేశ్ ఈ చర్యకు పాల్పడినట్లు చర్చ సాగుతున్నది.