Gaza | గత 21 నెలలుగా హమాస్ అంతమే లక్ష్యంగా గాజా స్ట్రిప్ (Gaza)పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. గాజాలోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులతో (Israeli airstrikes) విరుచుకుపడుతోంది. తాజాగా గాజాలోని పలు ప్రాంతాలపై ఐడీఎఫ్ జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 25 మంది పాలస్తీనియన్లు (Palestinians) మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జికిమ్ క్రాసింగ్ సమీపంలో సహాయ ట్రక్కుల కోసం వేచి చూస్తున్న వారిపై ఇజ్రాయెల్ దళాలు వైమానిక, తుపాకీ కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడినట్లు షిఫా ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. యుద్ధంతో తల్లడిల్లుతున్న గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఆకలితో 100 మందికి పైగా మరణించినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ(యూఎన్ ఆర్డబ్ల్యూ) తెలిపింది. మరణించిన వారిలో అధికంగా పిల్లలు ఉన్నట్లు పేర్కొంది. గాజాలోని ప్రజలను నడుస్తున్న శవాలుగా అభివర్ణించిన ఏజెన్సీ జోర్డాన్, ఈజిప్టులో తమకు చెందిన 6,000 ట్రక్కుల లోడుతో సమానమైన ఆహార, వైద్య సరఫరాలు నిలిచి ఉన్నాయని తెలిపింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 2023లో ప్రారంభమైన విషయం తెలిసిందే. హమాస్ ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాలపై దాడి చేసింది. ఈ దాడుల్లో 1200 మందికిపైగా ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారంలో ఇప్పటివరకు 59 వేలకుపైగా పాలస్తీనియన్లు మరణించారు. గాజాలో పెద్ద సంఖ్యలో జనాభా నిరాశ్రయులయ్యారు. వేలాది మంది ఆకలి బాధలను ఎదుర్కొంటున్నారు. గాజాలోని ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు తేలింది.
Also Read..
Donald Trump | హమాస్ కథ ముగించాల్సిందే.. ఇజ్రాయెల్‌కు ట్రంప్ కీలక సూచన
TRF | టీఆర్ఎఫ్ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అమెరికా.. ఎలాంటి అభ్యంతరం లేదన్న పాక్