గాజా: హమాస్-ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న దాడులు 15వ రోజుకు ఎంటర్ అయ్యాయి. అయితే అక్టోబర్ 7వ తేదీ నుంచి జరుగుతున్న ఫైటింగ్లో ఇప్పటి వరకు 22 మంది జర్నలిస్టులు(Journalists Killed) మృతిచెందారు. దీంట్లో 18 మంది పాలస్తీనియన్లు, ముగ్గురు ఇజ్రాయిలీలు, ఓ లెబనీస్ జర్నలిస్టు ఉన్నారు. సీపీజే (కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్) ఈ విషయాన్ని వెల్లడించింది. ఇజ్రాయిల్ చేసిన దాడుల వల్లే 15 మంది జర్నలిస్టులు మృతిచెందినట్లు సీపీజే పేర్కొన్నది. ఇక హమాస్ చేసిన దాడుల్లో ఇద్దరు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 8 మంది జర్నలిస్టులు గాయపడ్డారు. మరో ముగ్గురు ఆచూకీ లేరు.
మరో వైపు ఈజిప్టు నుంచి సహాయ సామాగ్రి ప్రస్తుతం రాఫా బోర్డర్ వరకు చేరుకున్నది. గాజాకు సరకుల్ని పంపేందుకు రాఫా క్రాసింగ్ వద్ద ట్రక్కుల్ని నిలిపారు. ఐక్యరాజ్యసమితికి చెందిన వాహనాలు అక్కడకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
ఇజ్రాయిలీలు సుమారు 200 మందిని కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. దాంట్లో ఇద్దరు అమెరికన్లను హమాస్ ఉగ్రవాదులు వదిలేశారు. తల్లీకూతుళ్లను వదిలినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొన్నది. బందీలందర్నీ విడిచిపెట్టే వరకు పోరాటం కొనసాగుతుందని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతాన్యూ తెలిపారు. దాడుల్లో ఇప్పటి వరకు గాజాలో సుమారు నాలుగు వేల మంది మృతిచెందినట్లు తెలుస్తోంది.