Nepal | నేపాల్‌లోని అత్యంత ప్రాచీనమైన పశుపతినాథ్ దేవాలయంలో 10 కిలోల బంగారం మాయమైందనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఆలయంలోని శివలింగం చుట్టూ 103 కిలోల బంగారంతో జలహరిని చేసే సమయంలో 10 కిలోల బంగారం కొట్టేశారని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆ దేశ పార్లమెంట్‌లోనూ చర్చ జరగడంతో నేపాల్ అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఆదివారం నాడు ఆలయాన్ని తమ స్వాధీనంలోకి తీసుకుని సోదాలు చేపట్టారు. జలహరి నాణ్యత, బరువుపై పరీక్షలు కూడా నిర్వహించినట్లు సమాచారం.
అవినీతి నిరోధక శాఖ ( సీఐఏఏ )అధికారుల తనిఖీల నేపథ్యంలో కొన్ని గంటల పాటు దర్శనాలను నిలిపివేయడంతో పాటు ఆలయాన్ని మూసివేశారు. అయితే ప్రముఖ ఆలయంలో తనిఖీలు అనేప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో నేపాల్ ఆర్మీతో పాటు భారీగా భద్రతా సిబ్బందిని కూడా రంగంలోకి దించారు. కాగా, జలహరి నాణ్యత, బరువుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దాన్ని సీఐఏఏ అధికారులు పరిశీలించారని.. ఈ క్రమంలోనే భక్తులను ఆలయంలోకి అనుమతించలేదని ఆలయ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఘన్‌శ్యామ్ ఖత్వాడీ వెల్లడించారు.
నేపాల్ రాజధాని ఖాట్మండూలో ఉన్న అత్యంత ప్రాచీన హిందూ దేవాలయాల్లో పశుపతినాథ్ ఆలయం ఒకటి. ఇక్కడికి నేపాల్‌తో పాటు భారత్ నుంచి కూడా భక్తులు వెళ్లి మహాశివుడిని దర్శించుకుంటున్నారు. ఎంతో మహిమాన్వితమైన ఆ క్షేత్రంలోని శివలింగం చుట్టూ బంగారంతో కూడిన జలహరిని ఏర్పాటు చేయాలని అప్పట్లో నిర్ణయించారు. దీనికోసం పశుపతి ఏరియా డెవలప్మెంట్ అథారిటీ 103 కిలోల బంగారాన్ని కూడా కొనుగోలు చేసింది. దీంతో గత ఏడాది మహాశివరాత్రి సమయంలో జలహరిని ఏర్పాటు చేశారు. అయితే జలహరి 103 కిలోల బరువు ఉండదని.. అందులో 10 కిలోల బంగారం మాయమైందని ఇటీవల వార్తలు మొదలయ్యాయి. దీనిపై ఆ దేశ పార్లమెంట్‌లోనూ ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో ఇందులో నిజమెంత ఉందో తెలుసుకునేందుకు కమిషన్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ అబ్యూజ్ ఆఫ్ అథారిటీ (CIAA)కి నేపాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన సీఐఏఏ అధికారులు ఆదివారం ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు.