న్యూఢిల్లీ: భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోవడానికి కారణం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ చెప్పారు. ఆయన ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ ఒప్పందం ఫ్రేమ్‌వర్క్ సిద్ధమైందని, అయితే, తుది ఆమోదం ఓ వ్యక్తిపై ఆధారపడి ఉన్న విషయం మొదటి నుంచి స్పష్టమేనని తెలిపారు. ఆ వ్యక్తికి ఇటువంటి ఒప్పందాలకు అధికారికంగా ఆమోదం తెలిపే అధికారం ఉందన్నారు. ఈ ఒప్పందం ముందుకు కదలాలంటే మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు వ్యక్తిగతంగా ఫోన్ చేయవలసి ఉంటుందని తాను భారత వాణిజ్య ప్రతినిధులకు చెప్పానని తెలిపారు.
భారత ప్రతినిధులు దీన్ని అసౌకర్యంగా భావించారని, మోదీ ట్రంప్‌నకు ఫోన్ చేయలేదని చెప్పారు. ఫలితంగా ఈ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు.“మేం అంగీకరించిన ఒప్పందాన్ని భారత ప్రతినిధులు మాకు గుర్తు చేశారు. నాకు గుర్తుంది. ఈ ఒప్పందానికి మీరు ఒప్పుకున్నారని వారు నాకు చెప్పారు. అప్పుడు అంగీకరించాను, కానీ ఇప్పుడు కాదు అని నేను వారికి చెప్పాను” అని లుట్నిక్ తెలిపారు. “మోదీ ట్రంప్‌నకు ఫోన్ చేయలేదు. ఆ తర్వాత మేం అనేక ఒప్పందాలు చేసుకున్నాం. అనంతరం భారత్ ఫోన్ చేసింది, మేం సిద్ధమని చెప్పింది. దేనికి సిద్ధం? అని నేను అన్నాను.
భారత్ స్పందిస్తూ, లుట్నిక్ వివరణ సరిగ్గా లేదని చెప్పింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియాతో మాట్లాడుతూ, అమెరికా, భారత్ అనేక సందర్భాల్లో ట్రేడ్ డీల్ కుదిరే దశకు వచ్చాయని తెలిపారు. ఈ చర్చల స్వభావం గురించి లుట్నిక్ ఇచ్చిన వివరణ, చేసిన వ్యాఖ్యలు కచ్చితమైనవి కావన్నారు.