గురువారం 21 జనవరి 2021
International - Dec 17, 2020 , 19:39:51

ఆ బాలిక మృతికి కారణం కాలుష్యమే.. బ్రిటన్‌ కోర్టు సంచలన తీర్పు

ఆ బాలిక మృతికి కారణం కాలుష్యమే.. బ్రిటన్‌ కోర్టు సంచలన తీర్పు

బ్రిటన్‌కు చెందిన ఒక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కాలుష్యం కారణంగానే తొమ్మిదేండ్ల బాలిక చనిపోయిందని యూకే కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు అన్ని దేశాల పాలకులకు కనువిప్పు కలుగాలని కోర్టు భావించింది. ప్రపంచంలోనే ఈ తరహా తీర్పు ఇదే తొలిసారి అని నిపుణులు చెప్తున్నారు. 

ఎల్లా అడూ కిస్సీ డెబ్రా అనే తొమ్మిదేండ్ల చిన్నారి 2013లో తీవ్రమైన ఆస్తమాకు గురైంది. మూడేండ్లలో దాదాపు ఆమెను 30 సార్లు దవాఖానకు తరలించి చికిత్స చేశారు. అయితే ఎంతకీ శ్వాస తీసుకోవడంలో ఏర్పడిన ఇబ్బందులు తొలిగిపోలేదు. బ్రిటన్‌లోని ప్రధాన నగరమైన లండన్‌ రింగ్‌ రోడ్డుకు 30 కిలోమీటర్ల దూరంలో డెబ్రా కుటుంబం  నివసించేది. ఈ రోడ్డులో తరచుగా భారీ ట్రాఫిక్‌తో నిండిపోవడం, వాయు కాలుష్యం విస్తరించడం  షరా మామూలై పోయింది. దాంతో శ్వాస తీసుకోవడంలో డెబ్రా తీవ్ర ఇబ్బందులు పడి ఆస్తమా పేషెంట్‌గా తయారైంది. తీవ్ర వాయు కాలుష్యానికి గురవడం.. గాలి నాణ్యత తక్కువగా ఉండటం వల్లనే ఆ బాలిక చనిపోయిందని యూకేలోని కోరోనర్‌ తీర్పునిచ్చారు. డెబ్రా మరణ ధ్రువీకరణ పత్రంలో కూడా వాయు కాలుష్యం వల్లనే మరణం సంభవించిందని నమోదు చేశారు. 

"ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల కంటే ఎక్కువ నత్రజని డయాక్సైడ్ (NO2) స్థాయికి గురైంది. ఆమె చనిపోవడానికి ప్రధాన కారణం ట్రాఫిక్ నుంచి వెలువడిన ఉద్గారాలే" అని అసిస్టెంట్‌ కోరోనర్‌ ఫిలిప్‌ బారో చెప్పారు. గాలిలోని NO2 స్థాయిలను తగ్గించడంలో వైఫల్యం చెందడం వల్లనే ఘోరం జరిగిపోయిందని బారో తెలిపారు. ఇదే కాకుండా, బాలిక మరణాన్ని నిరోధించే చర్య తీసుకోవడానికి ప్రేరేపించేలా తల్లికి కీలకమైన సమాచారం ఇవ్వలేదని కోర్టు ఆరోపించింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo