వాషింగ్టన్, సెప్టెంబర్ 17: మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేక వాటిని ఉత్పత్తి చేస్తున్న ప్రధాన దేశాలలో భారత్, చైనా, పాకిస్థాన్ అఫ్గానిస్థాన్తోసహా 23 దేశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మాదకద్రవ్యాలు, వాటిని తయారుచేయడానికి ఉపయోగించే రసాయనాలను అక్రమ రవాణా, ఉత్పత్తి చేయడం ద్వారా ఈ దేశాలు అమెరికాకు, తమ దేశ ప్రజల భద్రతకు ముప్పు తీసుకువస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. అమెరికన్ పార్లమెంట్‌కు సోమవారం సమర్పించిన ఓ నివేదికలో 23 దేశాలను డ్రగ్స్ అక్రమ రవాణా లేక ఉత్పత్తి చేస్తున్న ప్రధాన దేశాలుగా తాను గుర్తించినట్లు ట్రంప్ తెలిపారు. ట్రంప్ ప్రకటించిన దేశాలలో భారత్, చైనా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బహమాస్, బెలీజ్, బొలీవియా, బర్మా, కొలంబియా, కోస్టారికా, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా, హైతీ, హోండురాస్, జమైకా, మెక్సికో, నికరగువా, పనామా, పెరూ, వెనిజులా ఉన్నాయి. అమెరికాలోకి అక్రమంగా డ్రగ్స్ రావడానికి ఈ దేశాలే కారణమని ఆయన తన నివేదికలో ఆరోపించారు. డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టడంతో అఫ్గానిస్థాన్, బొలీవియా, బర్మా, కొలంబియా, వెనిజులా ఘోరంగా విఫలమయ్యాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ దేశాలు నార్కోటిక్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు.