Jaish-e chief | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ విజయవంతంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) దాయాది దేశం పాక్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా చేపట్టిన ఈ దాడులతో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ (Jaish-e chief) మౌలానా మసూద్ అజార్ (Masood Azhar)కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే అజార్ కుటుంబం మొత్తం హతమైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన సోదరుడు, ప్రస్తుతం జైషే నెంబర్-2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్ (Abdul Rauf Asghar) సైతం ప్రాణాలు కోల్పోయారు.
భారత్ దాడుల్లో బహవల్పూర్ (Bahawalpur)లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం (Jaish terror camp) పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడిలో 10 మంది మసూద్ కుటుంబ సభ్యులు, నలుగురు సహాయకులు ప్రాణాలు కోల్పోయారు. జైషే చీఫ్ ప్రాణాలతోనే ఉన్నట్లు తెలిసింది. భారత్ జరిపిన దాడిలో తన కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయినట్లు మసూదే స్వయంగా వెల్లడించారు. తాజాగా అతడి సోదరుడు రవూఫ్ అస్గర్ కూడా మరణించారు.
రవూఫ్ అస్గర్ పలు ఉగ్రదాడుల్లో కీలక నిందితుడు. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసీ-814 హైజాక్ (IC-814 hijacking) సూత్రధారి. అతడి మాస్టర్మైండ్స్తో ఐదుగురు పాక్ ఉగ్రవాదులు నేపాల్‌లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి కాందహార్‌కు తరలించారు. అనంతరం భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి.. ఇక్కడి జైళ్లలో ఉన్న ఉగ్రనాయకులు మసూద్ అజహర్, అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్గర్‌ను విడిపించుకొని తీసుకెళ్లారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక జర్నలిస్టు డేనియల్ పెర్ల్ హత్యలో కూడా ఇతడి పాత్ర ఉంది. అంతేకాదు భారత్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల వెనుక ఇతడి హస్తం ఉంది. 2001లో జరిగిన పార్లమెంట్‌పై దాడి, 2016లో పఠాన్ కోట్ దాడి, 2019లో పుల్వామా వంటి ఉగ్ర ఘటనల్లో రవూఫ్ ప్రమేయం ఉంది.
Also Read..
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్‌తో నేలమట్టమైన ఉగ్రస్థావరాలు.. ఉపగ్రహ చిత్రాలు
India-Pak | పాక్‌కు గట్టి షాక్.. లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ధ్వంసం చేసిన భారత్
Bomb Threat | ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావిస్తూ.. జైపూర్ క్రికెట్ స్టేడియానికి బాంబు బెదిరింపులు