Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, మస్క్‌తో విభేదాలపై ట్రంప్ తాజాగా స్పందించారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు (Big Beautiful Bill) విషయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మస్క్‌పై అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు.
ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. మస్క్‌పై ప్రశంసలు కురిపించారు. ‘మస్క్ అద్భుతమైన వ్యక్తి. తెలివైనవారు. ప్రభుత్వానికి సంబంధించిన వివిధ విషయాల్లో ఆయన చాలా బాగా పనిచేశారు’ అంటూ ప్రశంసించారు. ఎలక్ట్రిక్ వాహన పన్ను క్రెడిట్ రద్దు నిర్ణయంపై మస్క్ కలత చెందారని అధ్యక్షుడు తెలిపారు. అది అతడికి కఠిన నిర్ణయమే అయినప్పటికీ.. ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ కారును కొనాలని తాను కోరుకోనని ట్రంప్ వ్యాఖ్యానించారు.
కాగా, ఇటీవలే ట్రంప్ యంత్రాంగం తెచ్చిన ‘బిగ్ బ్యూటీఫుల్ బిల్లు’ను మస్క్ వ్యతిరేకించడంతోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ బిల్లు విషయంలో ట్రంప్‌పై మస్క్ నేరుగానే విమర్శలు గుప్పించారు. ట్రంప్‌ను అభిశంసించి, ఆ స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను అధ్యక్షుడిగా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టీన్తో ట్రంప్‌నకు సంబంధాలున్నాయని, ఎప్స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరుందని, అందుకే దానిని ఆయన బయటపెట్టడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు.
బిగ్ బ్యూటిఫుల్ బిల్ వ్యవహారంలో మస్క్ తీరుతో తాను విసిగిపోయానంటూ ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతేకాదు, ‘మా బడ్జెట్లో నిధులను, బిలియన్ల కొద్దీ డాలర్లను ఆదా చేయాలంటే సులభమైన మార్గం ఎలాన్ మస్క్‌కు ఇచ్చిన ప్రభుత్వ సబ్సిడీలను, కాంట్రాక్టులను రద్దు చేయడమే’ అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటనతో టెస్లా షేర్లు 14.3 శాతం నష్టపోయి, 150 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. ఒకే రోజు ఇంత గరిష్ట స్థాయిలో నష్టపోవడం టెస్లా చరిత్రలో ఇదే ప్రథమం. ఇది జరిగిన కొద్ది సేపటికి ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి అభిశంసించాలంటూ మస్క్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
మస్క్ పార్టీ ‘ద అమెరికా పార్టీ’?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెస్లా అధినేత మస్క్ మధ్య తీవ్ర విభేదాలు చోటుచేసుకుని మిత్రులిద్దరూ శత్రువులుగా మారిన క్రమంలో మస్క్ కొత్త పార్టీకి శ్రీకారం చుడతారనే ప్రచారం జరుగుతున్నది. ఇదే విషయాన్ని మస్క్ ‘ద అమెరికా పార్టీ’ అనే పార్టీ ఏర్పాటు గురించి ఎక్స్‌లో సూచనప్రాయంగా వెల్లడించారు. దీనిపై ఆయన ఇప్పటికే సామాజిక మాధ్యమంలో అభిప్రాయ సేకరణ కూడా జరిపారు. దీంతో ఈ మిలియనీర్ కొత్త పార్టీ పెట్టడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతున్నది.
Also Read..
Bangladesh | బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం.. స్థానిక రాజకీయ నేత అరెస్ట్
Fatwa | వారు దేవుడి శత్రువులు.. ట్రంప్, నెతన్యాహుపై ఇరాన్లో ఫత్వా జారీ
America | అగ్నిమాపక సిబ్బందిపై కాల్పులు.. ఇద్దరు మృతి