Jaish Women Wing | పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే తన కార్యకలాపాలను విస్తరించేందుకు మహిళలతో ఓ ఉగ్రవాద గ్రూప్ (Jaish Women Wing)ను తయారుచేస్తున్న విషయం తెలిసిందే. మసూద్ అజార్ (Masood Azhar) సోదరి సాదియా అజార్ (Sadiya Azhar) మహిళా గ్రూపుకు నేతృత్వం వహిస్తున్నారు. ‘జమాతుల్-ముమినాత్’ (Jamaat ul Mominaat) పేరుతో ఓ ప్రత్యేక యూనిట్‌ను తయారు చేస్తున్నది. అయితే, కొద్ది వారాల వ్యవధిలోనే వేల సంఖ్యలో మహిళల్ని ఆకర్షించినట్లు తేలింది. ఈ విషయాన్ని స్వయంగా మసూద్ అజారే సోషల్ మీడియా వేదికగా వెల్లడించడం గమనార్హం.
ఉగ్రవాద సంస్థ మహిళా విభాగంలో నియామకాల సంఖ్య పెరుగుతోందని జైష్ చీఫ్ మసూద్ అజార్ అందులో పేర్కొన్నారు. ఇప్పుడు జిల్లా యూనిట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘జైషే మహిళా విభాగంలో నియామకాల సంఖ్య పెరుగుతోంది. చాలా తక్కువ సమయంలోనే 5,000 మందికిపైగా మహిళలు చేరారు. ఇదంతా అల్లా దయ వల్లే జరిగింది. చాలా మంది సోదరీమణులు నియామకం పొందిన వెంటనే తమ మానస్థిక స్థితిమారిపోయినట్లు చెబుతున్నారు. జీవిత లక్ష్యాన్ని గ్రహించినట్లు చెప్పారు. ఇప్పుడు జిల్లా యూనిట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి జిల్లాకు ఒక ముంటాజియా (మేనేజర్) ఉంటారు’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
కాగా, పలు నివేదికల ప్రకారం.. జమాతుల్-ముమినాత్ కోసం నియామక డ్రైవ్ ఈ ఏడాది అక్టోబర్ 8న జైషే ప్రధాన కార్యాలయం మర్కజ్ ఉస్మాన్-ఓ-అలీలో ప్రారంభమైంది. ఈ డ్రైవ్‌లో భాగంగా పాక్‌లోని బహవల్పూర్, ముల్తాన్, సియాల్కోట్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లి నుంచి మహిళలను ఉగ్రవాద సంస్థలోకి చేర్చుకున్నారు. ఈ సంస్థ రూ.500 ఫీజుతో 40 నిమిషాలు ఆన్లైన్ శిక్షణ ఇస్తూ.. మహిళల్ని ఉగ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఐఎస్ఐఎస్, హమాస్, ఎల్టీటీఈ తరహాలో ఫిదాయిన్ (ఆత్మాహుతి) దాడులు నిర్వహించడానికి ఈ మహిళలతో ఉగ్రవాద బ్రిగేడ్లను ఏర్పాటు చేయడమే ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది.
Also Read..
IndiGo | సిబ్బంది కొరతతో ఇండిగో సతమతం.. రెండు రోజుల్లో 300 విమానాలు రద్దు.. ప్రయాణికుల అవస్థలు
Taj Mahal | తాజ్‌మహల్ ఆగ్రాకు శాపంగా మారిందట.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Fancy Number Plate | 1.75 కోట్లకు ఫ్యాన్సీ నంబర్ కొన్నాడు.. డబ్బులు చెల్లించకుండా ముఖం చాటేశాడు..