Strait of Hormuz : హార్ముజ్ జలసంధిని దిగ్బంధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఇదే జరిగితే ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థకు చాలా నష్టమే కలుగుతుంది. అయితే, అందరికంటే ఎక్కువగా నష్టపోయేది మాత్రం ఇరాన్. ఎందుకంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం హార్ముజ్. అలాంటి హార్ముజ్‌ను దిగ్బంధించడం ద్వారా ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చి, తన దారికి తెచ్చుకోవాలనేది అమెరికా ప్లాన్. ఈ అంశంలో అమెరికా ఒక అంచనాతో ఉంది. ఇరాన్‌కు రోజుకు, నెలకు ఎంత నష్టం కలుగుతుంది అనే అంచనాలు అమెరికా వద్ద ఉన్నాయి.
అమెరికా ట్రెజరీ అధికారి మిదాడ్ మలేకి అంచనా ప్రకారం.. హార్ముజ్‌ను దిగ్బంధించడం ద్వారా ఇరాన్‌కు ప్రతిరోజూ 435 మిలియన్ డాలర్ల నష్టం కలగనుంది. ఎగుమతుల ద్వారా సగటున రోజుకు 276 మిలియన్ డాలర్లు, దిగుమతుల ద్వారా 159 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఇదంతా ఇరాన్ నష్టపోనుంది.. మొత్తంగా ఒక నెలకు 13 బిలియన్ డాలర్ల వరకు ఇరాన్‌కు నష్టం జరుగుతుంది. ఇరాన్ వ్యాపారం 90 శాతం పర్షియన్ గల్ఫ్ ద్వారానే జరుగుతుంది. అందులో చమురు, గ్యాస్ వాటా 80 శాతం. దేశ జీడీపీలో ఈ వాటా 23.7 శాతం. ఇరాన్ అధీనంలోని ఖర్గ్ ఐలాండ్ ఒక్కటే 53 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అందిస్తోంది.
ఇక్కడి నుంచే ఇరాన్ 92 శాతం చమురు రవాణా చేస్తుంటుంది. ఇరాన్ ప్రతి రోజూ 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురును విదేశాలకు ఎగుమతి చేస్తూ సగటున 139 మిలియన్ డాలర్లు అర్జిస్తోంది. ఇప్పుడు అమెరికా ఈ మార్గాన్ని మూసేస్తే ఈ ఆదాయాన్ని ఇరాన్ కోల్పోవాల్సి వస్తుంది. 2024-25లో ఇరాన్ చమురు ఎగుమతుల ద్వారా 19.7 బిలియన్ డాలర్లు సంపాదించింది. అంటే రోజుకు 54 మిలియన్ డాలర్లు. అలాగే, చమురేతర ఉత్పత్తుల ద్వారా 2025లో 51.7 బిలియన్ డాలర్లు ఆదాయాన్ని పొందింది. అంటే సగటున రోజుకు 88 మిలియన్ డాలర్లు సంపాదించింది. ఇందులో గల్ఫ్ ప్రాంతం నుంచే 90 శాతం ఎగుమతులు చేస్తోంది. అసలుయే పోర్టు, ఇమామ్ ఖోమేని పోర్టు, షాహిద్ రాజాయీ పోర్టుల నుంచి కూడా ఈ రవాణా జరుగుతుంది.
అయితే, ఇప్పుడు ఇవన్నీ అమెరికా దిగ్బంధం చేయబోయే ప్రాంతాల పరిధిలోనే ఉన్నాయి. దీంతో ఈ దారుల గుండా జరిగే ఎగుమతులు నిలిచిపోతాయి. దీంతో ఇరాన్‌కు భారీ నష్టం తప్పదు. అయితే, ఇరాన్‌కు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు చాలా తక్కువ. అందులో కీలకమైంది జాస్క్ పోర్ట్. ఇక్కడి నుంచి రోజుకు 1 మిలియన్ బ్యారెళ్ల చమురును మాత్రమే ఎగుమతి చేయొచ్చు. ప్రస్తుతం ఇక్కడి నుంచి 70,000 బ్యారెళ్ల చమురు మాత్రమే ఎగుమతి అవుతోంది.