Wildfire | అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో (Los Angeles) కార్చిచ్చు (Wildfire) వ్యాప్తి కొనసాగుతోంది. వేగంగా వీస్తున్న గాలులతో మంటలు కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో వేలాది ఇండ్లు కాలి బూడిదవుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లుతోంది. ప్రాణనష్టం సైతం క్రమంగా పెరుగుతోంది.
ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. కార్చిచ్చులో మరణించిన వారి సంఖ్య 24కు పెరిగింది. మరణించిన వారిలో అత్యధికంగా ఏటోన్ ఫైర్లోనే 16 మంది కాగా, పాలిసేడ్స్‌లో 8 మంది ఉన్నారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ అగ్ని ప్రమాదాల్లో సుమారుగా 16 మంది తప్పిపోయినట్లు స్థానిక మీడియా నివేదించింది. మంటల ధాటికి ఇప్పటి వరకూ 12,000 నిర్మాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. అంతేకాదు, పాలిసేడ్స్‌లో 23,707, ఏటోన్లో 14,117ఎకరాలు, కెన్నెత్‌లో 1,052, ముర్సెట్లో 779 ఎకరాలు దగ్ధమైనట్లు పేర్కొంది.
మంటలను ఆర్పేందుకు కాలిఫోర్నియాతో పాటు అమెరికాలోని తొమ్మిది నగరాలు, మెక్సికోకు చెందిన అగ్నిమాపక బృందాలు పని చేస్తున్నాయి. కాగా, లాస్ ఏంజెల్స్‌లో నివసించే హాలీవుడ్ నటులు వారికి కేటాయించిన నీటి కంటే ఎక్కువ వినియోగించుకున్నారని, దీంతో ఇప్పుడు మంటలు ఆర్పేందుకు నీటి కొరత ఏర్పడిందని మర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత వినాశకరమైన ప్రకృతి వైపరీత్యమని కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ అన్నారు.
కమలా హారిస్ ఇంటికీ ముప్పు
కార్చిచ్చు కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం పాలిసేడ్స్ అగ్ని బ్రెంట్వుడ్ వైపు మళ్లింది. ఈ ప్రాంతంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో పాటు పలువురు క్రీడాకారులు, నటీనటుల ఇండ్లు ఉన్నాయి. దీంతో ఉపాధ్యక్షురాలి హోదాలో చేయాల్సిన తన చివరి విదేశీ పర్యటనను కమలా హారిస్ రద్దు చేసుకున్నారు. మరోవైపు అమెరికాలోని టెక్సాస్, ఓక్లహోమా, మరికొన్ని రాష్ర్టాలను మంచు తుఫాను అతలాకుతలం చేస్తున్నది.
Also Read..
AI Robot Girlfriend | ఏఐ రోబో గర్ల్‌ఫ్రెండ్.. మగవారి ఒంటరితనాన్ని దూరం చేస్తుందట!
Earth | భూ కేంద్రంలో మరో పొర.. ఆ రహస్య నిర్మాణం ఏమై ఉంటుంది?
Wildfire | అమెరికాలో ఆగని దావాగ్ని.. కమలా హారిస్ ఇంటికీ ముప్పు