Earth | న్యూఢిల్లీ, జనవరి 12: భూమి అనేక పొరలతో కూడిన అంతుబట్టని అద్భుత నిర్మాణం. అత్యంత సంక్లిష్టమైన ఈ నిర్మాణాన్ని సైంటిస్టులు ప్రధానంగా నాలుగు (క్రస్ట్, మాంటెల్, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్) పొరలుగా విడగొట్టారు. నాలుగు కాదు..ఐదో పొర కూడా ఉందని గత కొంత కాలంగా ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ సైంటిస్టులు చెబుతున్నారు.
అయితే ఇందుకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు లభ్యమయ్యాయని వారి పరిశోధన పేర్కొన్నది. ‘జర్నల్ ఆఫ్ జియోగ్రఫికల్ రీసెర్చ్’ ప్రచురితమైన కథనం ప్రకారం, భూమి పొరల్లో కేంద్ర భాగమైన ‘ఇన్నర్ కోర్’లో అదనంగా మరో పొర ఉందని శాస్త్రవేత్తల పరిశోధన చెబుతున్నది. ఇన్నర్ కోర్ లోతుల్లో ఉన్న మరో పొర ఇనుము-నికెల్ లోహ మిశ్రమంతో కూడి ఉందని గుర్తించారు. భూకంపం సంభవించాక.. శక్తి తరంగాలు, భూకంప తరంగాలు భూమిలో ఎలా ప్రయాణిస్తున్నాయన్న దానిపై సైంటిస్టులు అధ్యయనం చేస్తున్నారు.
ఈ తరంగాలు వేర్వేరు దిశల్లో వేర్వేరు వేగాలతో పయనిస్తున్న సంగతిని గుర్తించారు. అంతర్గత కేంద్రం (కోర్)లో ఒకటికి బదులు రెండు పొరలు ఉండటం వల్లే ఇది సాధ్యమవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. మానవులు సహా జంతు జీవ జాలమంతా నివసిస్తున్న బయట పొరను ‘క్రస్ట్’గా పిలుస్తారు. దీని కింద ఉన్నది ‘మాంటిల్’. ఇక భూమి కేంద్ర భాగాన్ని ‘కోర్’గా పేర్కొన్నారు. దీనిని ఇన్నర్, ఔటర్..అనే రెండు భాగాలుగా విడగొట్టారు. భూ అయస్కాంత శక్తి ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతున్నది.