AI Robot Girlfriend | న్యూఢిల్లీ, జనవరి 12: హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘హర్’ను తలపిస్తూ అమెరికా టెక్ కంపెనీ ఏఐ రోబో గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకొచ్చింది. దీని ధర కేవలం రూ.1.5 కోట్లు(సుమారుగా 1,75,000 డాలర్లు). అచ్చు గుద్దినట్టు మనుషులను పోలి ఉండటమే కాదు, మనిషిని..రోబోను వేరు చేయలేనంతగా ఇది మనుషుల్లో కలిసిపోతుందట. పురుషుల ఒంటరితనాన్ని దూరం చేయగల సహచరిణిగా ఈ రోబో ఉండగలదని దీన్ని తయారుచేసిన ‘రియల్ బోటిక్స్’ కంపెనీ చెబుతున్నది.
లాస్ వెగాస్‌లో జరుగుతున్న ‘2025-కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్’ షోలో తాము అభివృద్ధి చేసిన ‘ఆరియా’ రోబో గర్ల్‌ఫ్రెండ్‌ను రియల్‌బోటిక్స్ ఆవిష్కరించింది. దీని గురించి కంపెనీ సీఈవో ఆండ్రూ కిగ్వెల్ మాట్లాడుతూ, ‘పురుషుల ఒంటరితనాన్ని దూరం చేయగలిగేది, మనుషుల నుంచి వేరు చేయలేని విధంగా ఉండేలా ఓ రోబోను తీసుకురావాలనుకున్నాం’ అని అన్నారు. ఇంతవరకు ఎవ్వరూ చేయని విధంగా భావోద్వేగాలను పంచుకునే ఒక రియలిస్టిక్ రోబోను తయారుచేశామని ఆయన అన్నారు. సహచరణిగా ‘ఆరియా’ కొంత మందికి మనోహరమైనది, మరికొంత మందికి భయంకరమైనదని కిగ్వెల్ చమత్కరించారు.